ఆచార్య బ‌డ్జెట్ లో కోత‌..లాక్ డౌన్ దెబ్బేనా!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇది చిరంజీవి న‌టిస్తోన్న 152వ చిత్రం. కొణిదెల ప్రొడ‌క్షన్ కంపెనీ-మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నాయి. మెగాస్టార్ మార్కెట్ దృష్ట్యా ఖ‌ర్చు విష‌యంలో ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌కుండా షూటింగ్ ప్రారంభించారు. ఇప్ప‌టికే 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. కొర‌టాల స్టైలిష్ మేకింగ్ కోసం భారీగానే ఖ‌ర్చు అవుతుంది. అంద‌మైన లొకేష‌న్స్..భారీ సెట్లు అన్ని వాస్త‌వ వాతావ‌ర‌ణాన్ని త‌లిపించేలా ఉంటాయి. అందుకే కొర‌టాల సినిమా అంటే మినిమం 70 కోట్ల బ‌డ్జెట్ అవుతుంది.

ఆచార్య కూడా అలాగే ప్లాన్ చేసారు. కానీ తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో సినిమా బ‌డ్జెట్ లో భారీగా కోత వేస్తున్న‌ట్లు స‌మాచారం. లాక్ డౌన్ కార‌ణంగా అన్ని రంగాలు ఆర్ధిక ఇబ్బందుల్లో ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా సినిమా ప‌రిశ్ర‌మ తీవ్రంగా న‌ష్ట‌పోయిన మాట వాస్త‌వం. దీంతో 70 కోట్లు..100 కోట్లు సినిమా మీద పెడితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తిరిగి రావ‌ని ఆలోచించుకుని బ‌డ్జెట్ లో కోత వేస్తున్న‌ట్లు స‌మాచారం. దానికి త‌గ్గ‌ట్టు స్ర్కిప్ట్ లో మార్పులు కూడా చేస్తున్నారుట‌. మార్చిన స్ర్కిప్ట్ తో బ్యాలెన్స్ షూటింగ్ పూర్తిచేయ‌నున్నార‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో థియేట‌ర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియ‌దు.

ఎలా లేద‌న్నా థియేట‌ర్లు తెరుచుకోవ‌డానికి ఆరు నెల‌లైనా స‌మ‌యం ప‌డుతుందంటున్నారు. తెరిచిన త‌ర్వాతైనా జ‌నాలు థియేట‌ర్ వైపు చూసే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గానే ఉంటాయ‌ని నిర్మాత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాంటప్పుడు తెరిచి ఏం లాభం అన్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమాను డిజిట‌ల్ స్ర్టీమింగ్ ల ద్వారానే విడుద‌ల చేసుకోవాలి. కానీ  డిజిట‌ల్ ద్వారా సినిమా రిలీజ్ చేస్తే నిర్మాత‌కు న‌ష్టాలు త‌ప్ప‌వు. ఎంత పెద్ద సంస్థ‌లైనా ఆన్ లైన్ లో కోట్లు దార‌బోసి కొన‌డానికి ముందుకు రావు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా నిర్మాణ ద‌శ‌లోనే ఖ‌ర్చు త‌గ్గించుకుంటే మంచిద‌ని భావించే ఆచార్య ఆ విధంగా ముందుకెళ్తున్న‌ట్లు తెలుస్తోంది.