అతనో స్టార్ డైరెక్టర్.. ఇండస్ట్రీ హిట్‌లని అందించాడు. కానీ ఈ మధ్య అతనికి కాలం కలిసి రావడం లేదు. దీంతో హీరోగా ఎంట్రి ఇవ్వాలని ఆశపుట్టింది. ఇంకేముంది అతన్నిహీరోగా పెట్టి సినిమా తీయడం మొదలుపెట్టాడు క్రేజీ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన నరసింహా దర్శకుడు. అయితే సినిమా పూర్తయి నెలలు గడుస్తున్నా రిలీజ్‌కి మాత్రం నోచుకోవడం లేదు. రిలీజ్ చేయకుండా సదరు నిర్మాతే ఆ చిత్రాన్ని అలా తొక్కిపెట్టేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు వి.వి.వినాయక్. ఆ సినిమా `సీనయ్య`. `ఆది` వంటి తొలి సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన దర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది. ఇండస్ట్రీలో వున్న మాస్ హీరోలతో పాటు చిరుతో రెండు సార్లు పనిచేసిన అనుభవం అతనిది. పిరియాడిక్ డ్రామా అని ఖాళీగా వున్న వినాయక్‌కి హీరో వేషం వేయించి ఇప్పుడేమో సినిమాని బయటికి వదలకుండా దిల్ రాజు ఆడుకోవడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. అయితే ఇన్‌సైడ్ టాక్ మరోలా వుంది. ఎంత శంకర్ వద్ద పనిచేసినా దర్శకుడు చిత్రాన్ని సంతృప్తికరంగా తెరపైకి తీసుకురావడంతో విఫలమయ్యాడట. ఫైనల్ అవుట్‌పుట్ చూసిన దిల్‌రాజు మళ్లీ అంతా మార్చాలని సూచనలు చేశాడని, ప్రస్తుతం ఆ మార్పులు జరుగుతున్నాయని వినిపిస్తోంది.