‘సైరా’ స్క్రిప్ట్.. ‘పరుచూరి బ్రదర్స్’సంభంధం లేదంటూ ట్విస్ట్ !

‘సైరా’ స్క్రిప్ట్.. ‘పరుచూరి బ్రదర్స్’రాయలేదని తేల్చాడు

సైరా కథను రాసిన తరువాత దాన్ని తీసుకొని చాలామంది హీరోల దగ్గరికి వెళ్లారట పరుచూరి బ్రదర్స్. కథ బాగుంది అని చెప్పినా.. సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని, మెగాస్టార్ కథ బాగుందని, సినిమా చేస్తానని చెప్పారని, సినిమా కోసం ఇన్నేళ్లు ఆగాల్సి వచ్చిందని, ఇప్పుడు ఆ కల నిజం అవుతుందని పరుచూరి బ్రదర్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ సైరా సినిమా రాసిపెట్టి ఉందని.. అందుకే మెగాస్టార్ సినిమా చేశారని పరుచూరి బ్రదర్స్ పేర్కొన్నారు. ఇదంతా సైరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన మాటలు. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చింది.

పరుచూరి బ్రదర్స్ రాసిన ‘సైరా’ స్క్రిప్ట్ ని తానూ తీసుకోలేదని.. తానే మిగిలిన రచయితల సాయంతో నరసింహారెడ్డి జీవితం పై ఎంతో రీసెర్చ్ చేసి ‘సైరా’కి సంబధించి కొత్త స్క్రిప్ట్ ను రాసుకున్నానని, ఆ స్క్రిప్ట్ నే సినిమాగా మలిచానని దర్శకుడు సురేందర్‌ రెడ్డి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

సురేంద్రరెడ్డి మాట్లాడుతూ…”నేను మొత్తం రీసెర్చ్ చేసి మళ్లీ రాసుకున్న స్క్రిప్ట్ ఇది. సైరా నరసింహారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పరుచూరి గారు చాలాగొప్పగా రీసెర్చ్ చేశారు. కాకపోతే వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా, నేను నా సొంతంగా రాసుకున్నాను. మళ్లీ స్క్రీన్ ప్లే చూసుకున్నాను. నేను స్టడీ చేసిన ఘటనల్ని కూడా పొందుపరిచాను.

ఎందుకంటే సైరా నరసింహారెడ్డి జీవితాన్ని మనం ఈ తరానికి చెబుతున్నాం. ఈ జనరేషన్ కు కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో మొత్తం మార్చడం జరిగింది. జరిగిన ఘటనలకు నాటకీయత తీసుకొచ్చాను. కంప్లీట్ గా నెరేషన్ స్టయిల్ మార్చేశాను. అంతా అయిన తర్వాత మళ్లీ పరుచూరి బ్రదర్స్ సలహా కూడా తీసుకున్నాను. వాళ్లను కూడా కలుపుకొని ముందుకెళ్లాను.”

మరి ఈ వ్యాఖ్యల పై పరుచూరి బ్రదర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రాబోతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.