సినిమా జ‌ర్న‌లిస్టులు 25వ క్రాఫ్టులో చేరిన‌ట్టేనా?

tollywood

సినిమా జ‌ర్న‌లిస్టుల్ని 25వ శాఖ‌లో చేర్చాల‌ని ద‌ర్శ‌క‌ర‌త్న కీ.శే. దాస‌రి నారాయ‌ణ‌రావు అనేవారు. అయితే అది మాట‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మైంది. నిరంత‌రం సినిమా వార్తా స్రవంతిలో బిజీ బిజీగా ఉండే సినిమా జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు భ‌రోసా ఏదీ ఉండ‌దా? అనే సందిగ్ధ‌త ఉండేది. అయితే అందుకు స‌రైన స‌మాధానం అసోసియేష‌న్ల రూపంలో క‌నిపిస్తోందా? అంతో ఇంతో భ‌రోసాను ఇచ్చేందుకు అసోసియేషన్లు కృషి చేస్తున్నాయా? అంటే క‌రోనా క్రైసిస్ వేళ కొంత బెట‌ర్ అన్న పాజిటివ్ నోట్ వినిపించింది. హెల్త్ కార్డులు.. ఇన్యూరెన్స్ స‌హా ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన అసోసియేష‌న్లు ఇప్పుడు క్రైసిస్ వేళ ఆదుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం ప్ర‌శంస‌నీయం.

ఫ‌లానా జ‌ర్న‌లిస్టు క‌ష్టంలో ఉంటే ఆదుకునేందుకు మేమున్నాం అంటూ ముందుకొచ్చే అసోసియేష‌న్ నాయ‌క‌త్వాల‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇప్ప‌టికే యాభై ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఫిలింక్రిటిక్స్ ఇ-మీడియా, వెబ్ మీడియాకు సంబంధించిన తెలుగు ఫిలిం జ‌ర్న‌లిస్టు అసోసియేష‌న్ (న్యూస్ క్యాస్ట‌ర్స్ అసోసియేష‌న్) సినిమా జ‌ర్న‌లిస్టుల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేయ‌డంపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారీ వ‌ల్ల లాక్ డౌన్ స‌న్నివేశం అన్ని రంగాల‌పైనా తీవ్ర ప్ర‌భావం చూపించింది. సినిమా షూటింగులు బంద్.. రిలీజ్ లు బంద్ కార‌ణంగా ఎవ‌రికి వారు ఇండ్ల నుంచి బ‌య‌టికి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇలాంటి స‌మ‌యంలో నిత్యావ‌స‌రాలు స‌హా ఆర్థికంగా తోచిన సాయం చేయాల‌ని అసోసియేష‌న్ నాయ‌క‌త్వాలు నిర్ణ‌యించుకుని ఇప్ప‌టికే సాయం చేయ‌డంపై హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ ఏకంగా 84 మంది జ‌ర్న‌లిస్టుల‌కు ఆర్థిక సాయం చేసింది. అలాగే తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ (టీ.ఎఫ్‌.జే.ఏ) (న్యూస్ కాస్ట‌ర్స్) 35 మంది మెంబ‌ర్స్ కి నిత్యావ‌స‌రాల స‌హాయం చేసింది. ఇంకా నిత్యావ‌స‌రాలు కోరే జ‌ర్న‌లిస్టుల‌కు సాయానికి ముందుకొచ్చింది. అయితే క్రిటిక్స్ అయినా.. టీఎఫ్‌.జే.ఏ అయినా.. ఈ సాయం కేవ‌లం ఒక నెల‌రోజుల‌కు మాత్ర‌మేనా? క‌రోనా క్రైసిస్ కొన‌సాగుతున్న అన్ని నెల‌లు ఇలానే స‌హాయం ఉంటుందా? అన్న‌ది వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే ఈఎంఐ భారంతో పాటు నెల‌వారీగా కుటుంబ‌ భ‌త్యం భారం త‌గ్గాలంటే ఈ సాయం స‌రిపోదు. అయితే కొంత‌వ‌ర‌కూ ఆదుకునే వీలుంటుంది. అందుకే మే 1.. జూన్ 1 .. జూలై 1 వ‌ర‌కూ సాయం అందించ‌గ‌లిగితే అది మ‌రింత మేలు చేస్తుంద‌ని జ‌ర్న‌లిస్టుల్లో మాటా మంతీ సాగుతోంది. మ‌రి అందుకు అసోసియేష‌న్ నాయ‌క‌త్వాలు సంసిద్ధ‌మేనా? అన్న‌ది వేచి చూడాలి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ లాక్ డౌన్ ని మే 3 వ‌ర‌కూ పొడిగించిన నేప‌థ్యంలో క్రైసిస్ య‌థాత‌థంగా కొన‌సాగుతున్న‌ట్టే. క్రైసిస్ తీవ్ర‌త‌ను బ‌ట్టి నిర్ణ‌యాలు ఎలా ఉండ‌నున్నాయో కాస్త ఆగితే కానీ తెలీదు.