ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. యుద్ధం ఏదైనా ఇక్కడే తేల్చుకోవాలి. గత కొద్ది కాలంగా కోలీవుడ్ హీరోలపై జీఎస్టీ అధికారుల ఎటాక్స్ గురించి సోషల్ మీడియా ప్రచారం తెలిసిందే. తాజా ఐటీ దాడుల్లో విజయ్ సహా విజయ్ సేతుపతి మరికొందరు స్టార్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. దళపతి విజయ్ ఆయన సన్నిహితుడైన ఏజీఎస్ అధినేత అన్బుపైనా ఐటీ దాడులు జరిగాయి. దాదాపు 300 కోట్ల విలువ చేసే ఆస్తులపై విచారణ జరిగింది. సేతుపతిపైనా ఐటీ ఎటాక్స్ కొనసాగాయన్న ప్రచారం హోరెత్తింది.
సోషల్ మీడియా ద్వారా రకరకాల నిజాలు బయటపడ్డాయి. ఇదంతా ఒకెత్తు అనుకుంటే.. విజయ్ సహా కోలీవుడ్ హీరోలపై కేంద్రంలోని భాజపా కావాలనే ఐటీ దాడులు చేయిస్తోందన్న ప్రచారం అంతకంతకు వేడెక్కిస్తోంది. ఇటీవల ఐటీ అధికారులు తమ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలంటూ విజయ్ కి సమన్లు జారీ చేయడంతో మరోసారి వేడెక్కే చర్చ సాగుతోంది.
విజయ్ అలాగే సహనటుడు విజయ్ సేతుపతి ఇద్దరిపైనా ఐటీ దాడులకు కారణం ఇదీ! అంటూ ఓ లేఖ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఇద్దరూ తమిళనాడులో మతపరమైన ప్రచారంలో స్పీడ్ చూపిస్తున్నారు. తమిళనాడు వడపళనిలోని ఓ మత కార్యక్రమంలోనూ ఆ ఇద్దరూ పాల్గొనడంతో ఈ పరిస్థితి కి దారి తీసిందని ఆ లేఖలో వెల్లడైంది. తాజా ఎటాక్స్ కారణమిదేనన్న వ్యాఖ్య ఆ లేఖలో కనిపించింది. అయితే ఈ లేఖపై ట్విటర్ లో విజయ్ సేతుపతి ఘాటుగా స్పందించాడు. తమపై వస్తున్న ట్రోలింగ్ కి “పోయి.. మీ పని చూసుకోండి“ అంటూ సేతుపతి ఫైరయ్యారు. తమకు మతవిశ్వాసాలతో ఎలాంటి సంబంధం లేదని అందరితో కలిసిపోవడమే అలవాటు అని సేతుపతి ఈ సందర్భంగా తెలిపారు. ఇలయదళపతి విజయ్ నటిస్తున్న `మాస్టర్` లో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సేతుపతి టాలీవుడ్ లో ఉప్పెన అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. బన్ని సినిమాలోనూ కీలక పాత్ర పోషించనున్నారు.