‘వాల్మీకి’ కి తెలంగాణ హై కోర్ట్ షాక్

‘వాల్మీకి’ టీమ్ కు హైకోర్టు నోటీసులు

ఇంకో వారం రోజుల్లో సినిమా విడుదల కానుందనగా ఇప్పుడు తెలంగాణ హై కోర్ట్ వాల్మీకికి సూపర్ షాక్ ఇచ్చింది. ఈ చిత్ర టైటిల్‌పై ముందు నుంచి కూడా వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాపై హై కోర్టులో విచారణ జరిగింది. ఈ సినిమా టైటిల్ తమ కులస్తులను కించపరిచే విధంగా ఉందని, వాల్మీకి అనే టైటిల్ ను తొలగించాలని బోయ హక్కులు పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది.

ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. సెన్సార్ బోర్డు, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్, డీజీపీ, హీరో వరుణ్ తేజ్ కు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ వాల్మీకి మార్పుకు సంకేతమని.. ఈ సినిమా ప్రజలను ఒక విషయంలో చైతన్యం తీసుకొస్తోందని అన్నాడు. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఈమధ్య హరీష్ స్నేహితుడు అతని కుమారుడిని ‘వాల్మీకి ఎవరు?’ అని ప్రశ్నించాడట. ఆ చిన్న బాబు తడుముకోకుండా ‘వరుణ్ తేజ్’ అని బదులిచ్చాడట. దీంతో అసలు వాల్మీకి మహర్షి ఎవరు.. మన చరిత్రలో ఆయనకు ఎలాంటి ప్రత్యేక స్థానం ఉంది అంటూ అ బాబుకు వివరించారట.

ఈ సినిమాలో కథ ప్రకారం …ఓ దుర్మార్గుడైన రౌడీ షీటర్ లో ఓ సినీ దర్శకుడి వల్ల మార్పు వస్తుంది. వాల్మికి కథ కూడా అంతే. ఒక దొంగ‌లోని ప‌రివ‌ర్త‌న అన్న‌ది వాల్మీకి క‌థ‌. అందుకే వాల్మికిని గుర్తు చేసేందుకు ఈ కథ కు ఈ టైటిల్ పెట్టారు.

హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెల 20 న విడుదల కానుంది. తమిళ హీరో అధర్వ, హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్‌, కథ: కార్తీక్‌ సుబ్బరాజ్‌, స్క్రీన్‌ప్లే: మధు, చైతన్య, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.