లాక్‌డౌన్ ఎఫెక్ట్ : `ఆచార్య‌` స్క్రిప్ట్‌లో మార్పులు!

కేవ‌లం నాలుగు చిత్రాల‌తో టాప్ డైరెక్ట‌ర్‌ల లిస్ట్‌లో చేరిపోయారు కొర‌టాల శివ‌. స‌మ‌కాలీన అంశాల్ని జోడించి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమాలు చేస్తున్నారాయ‌న‌. వామ ప‌క్ష భావాలు గ‌ల కుటుంబం నుంచి రావ‌డంతో ప్రారంభం నుంచి ఆ త‌ర‌హా చిత్రాల‌కే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా కొర‌టాల తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఆచార్య‌`. మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి తొలిసారి ప‌నిచేస్తున్న కొర‌టాల ఈ చిత్రాన్ని కూడా ఓ స‌మ‌కాలీన అంశం నేప‌థ్యంలోనే తెర‌కెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా జ‌న నాట్య‌మండ‌లి కార్య‌క‌ర్త‌గా క‌నిపిస్తార‌ని గ‌త కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఇందులో రాడిక‌ల్ భావాలుగ‌ల స్టూడెంట్ పాత్ర వుంది. 30 నుంచి 45 నిమిషాల పాటు సాగే ఈ పాత్ర కోసం ముందు రామ్‌చ‌ర‌ణ్‌ని అనుకున్నారు. ఆ త‌రువాత మ‌హేష్ లైన్‌లోకి వ‌చ్చాడు. తాజాగా ఆ పాత్ర‌ని రామ్‌చ‌ర‌ణ్ చేత చేయిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టే క్యారెక్ట‌ర్‌లో మార్పులు చేస్తున్నార‌ట‌.

ఇంత‌కు ముందు అనుఏకున్న పాత్ర‌కు పాట‌లు, యాక్ష‌న్ సీన్స్ పెద్ద‌గా లేవు కానీ ఓ రొమాంటిక్ సాంగ్‌తో పాటు ఓ బిట్ సాంగ్‌ని జోడించి మ‌రింత ప్ర‌భావ‌వంత‌గా చ‌ర‌ణ్ పాత్ర‌ని కొర‌టాల తీర్చిదిద్దుతున్నార‌ట‌. కాలేజ్ క్యాంప‌స్‌లో రెబ‌ల్ స్టూడెంట్ లీడ‌ర్‌గా రామ్‌చ‌ర‌ణ్ పాత్ర వుంటుంద‌ని తెలుస్తోంది. లాక్‌డౌన్ పూర్తి కాగానే జూన్ లేదా ప‌రిస్థితుల్ని బ‌ట్టి జూలైలో షూటింగ్ మొద‌లుపెట్టాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.