సెలబ్రిటీ వెడ్డింగుల్ని వెంటాడుతున్న కరోనా
రానా దగ్గుబాటి జువెలరీ బిజినెస్ లో ఫేమస్ అయిన బజాజ్ కుటుంబంలోని మిహీకను ప్రేమించి పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8న ఈ జంట వివాహం హైదాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ లో జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు కేవలం కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. మహమ్మారీ క్రైసిస్ లో పెళ్లి వేడుకలకు కేవలం 50 మంది లోపు మాత్రమే ఉండాలని ప్రభుత్వ నిబంధన ఉన్న సంగతి తెలిసిందే.
దాని ప్రకారమే అతిథుల జాబితాను సిద్ధం చేస్తున్నారట. ఇక ఇరు కుటుంబాలు ఈ పెళ్లి వేడుకను ఎంతో లోప్రొఫైల్ లోనే కానిచ్చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే పెళ్లికి ఏర్పాట్లు సాగుతున్నాయి. విందు బసలు సహా ప్రతిదీ ఆచితూచి ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేస్తూ దగ్గుబాటి వారు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ అంటే ఖర్చ దండీగానే ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ పెళ్లి జరిగింది. అలాగే ఆర్య- సయేషా జంట వివాహం జరిగాయి. వాటికి ఖర్చు కోట్లలోనే తేలింది. అయితే రానా పెళ్లి కి విందుకు అంత పెద్ద మొత్తంలో ఖర్చయ్యే అవకాశమే కనిపించడం లేదట.
అసలే మహమ్మారీ అంతకంతకు విజృంభిస్తోంది. ఆ క్రమంలోనే పెళ్లికి అనవసర హంగామా చేయాలన్న ఆలోచనే చేయడం లేదట. హోటల్ బుకింగ్ సహా ప్రతిదీ ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలిసింది. ఒకేళ మహమ్మారీ ఆగస్టులో మరింతగా పెరిగితే పెళ్లి కేవలం 10 మంది కుటుంబీకుల సమక్షంలోనే జరిగే వీలుందని ఓ సమాచారం లీకైంది. మొత్తానికి తాజా పరిస్థితులు చూస్తుంటే ఈ పెళ్లి వేడుక ఎంతో సాధాసీదాగానే ముగించాల్సిన పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. మెట్రో నగరంలో రోజుకు 1000-2000 పాజిటివ్ కేసులు నమోదయ్యే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఆ క్రమంలోనే ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిన పరస్థితి తలెత్తింది.