యాక్సిడెంట్ ప్లేస్ నుంచి అందుకే వెళ్లిపోయా: రాజ్ తరుణ్

యాక్సిడెంట్ విషయమై వివరణ ఇచ్చిన రాజ్ తరుణ్

నిన్నంతా రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ కేస్ విషయే మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొదట ఈ యాక్సిడెంట్ తరుణ్ కారుకు అయిందని అంతా అనుకున్నారు. మీడియాలో కూడా ఇదే కథనాలు రావడంతో ఆయనే బయటికి వచ్చి తనకేం కాలేదని చెప్పాడు. అయితే ఆ తర్వాత ఆ కారులో ఉన్నది రాజ్ తరుణ్ అని తెలిసింది. అయితే యాక్సిడెంట్ తర్వాత ఆయన కనిపించడం లేదు.

కారు వదిలేసి వెళ్లిపోవడంపై కూడా కథనాలు వచ్చాయి. దానికి తోడు కార్ వదిలేసి రాజ్ తరుణ్ వెళ్లిపోవడం స్పష్టంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ప్రమాదంలో ఆయనకేం జరగలేదు. అయితే ఈ యాక్సిడెంట్ విషయమై అనేక అనుమానాలు మీడియాలో వినిపిస్తున్నాయి. అవి పెద్దవి కాకుండా ఉండేందుకు కాను..రాజ్ తరుణ్ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.

 ‘‘నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. నేను క్షేమంగా ఉన్నానా? లేదా? అని తెలుసుకునేందుకు చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. నేను ఇంటి నుంచి నార్సింగ్ సర్కిల్ గుండా ప్రయాణిస్తున్నాను. ప్రమాదకర ప్రాంతంగా మారిన ఆ ప్రాంతంలో ఒక చోట హఠాత్తుగా కుడివైపునకు తిరగాల్సి వచ్చింది. దాంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీకొంది.

ఆ శబ్దానికి నా చెవులు బ్లాక్ అయిపోయాయి. దృష్టి కూడా చెదిరిపోయింది. హఠాత్తుగా గుండె వేగం కూడా పెరిగిపోవడంతో ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో నేను క్షేమంగానే బయటపడ్డాను. ఎవరి సహాయమైనా తీసుకుందామని వెంటనే ఇంటికి వెళ్లాను. ఆరోజు ఇదే జరిగింది. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలో మళ్లీ షూటింగ్‌కు హాజరవుతాను. ధన్యవాదాలు’’ అని రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు.