ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా భయంతో వణికిపోతోంది. దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించి తమ దేశ పౌరుల రక్షణ కోసం అహర్నిశం శ్రమిస్తున్నాయి. మన ఇండియాలోనూ లాక్ డౌన్‌ని విధించిన విషయం తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ పక్కాగా జరుగుతోంది. దీనికి పోలీసులు కృషి అభినందనీయం. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ట్విట్టర్ వేదికగా హీరో మహేష్ తెలంగాణ పోలీసులకు సెల్యూట్ చేసి ప్రశంసలు కురిపించారు.
ఈ విషయంలో మహేష్‌ని ఫాలో అయిన మెగాస్టార్ చిరంజీవి ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసుల్ని, వారు చేస్తున్న కృషిని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశాన్ని అందించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసుల తీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వాళ్లు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్ పోలీసుల శ్రమని చూస్తున్నాను. వారి పని తీరు వల్లనే రాష్ట్రంలో కరోనాని చాలా వరకు కట్టడి చేయగలిగాం. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ వారికి సహకరించాలని వేడుకొంటున్నాను. కరోనాని అంతమొందించే సమరంలో అలుపెరగని కృషి చేస్తున్న పోలీసులకు ఓ సోలీసు బిడ్డగా సెల్యూట్ చేస్తున్నాను` అన్నారు.
దీనికి తెలంగాణ డీజీపి కూడా స్పందించి చిరుపై ప్రశంసల వర్షం కురిపించారు. మీరే మాకు, మా సిబ్బందికి స్ఫూర్తి అని, పోలీసు కుటుంబానికి చెందిన సభ్యుడిగా మీ నుంచి ప్రేరణ పొందామని, కరోనాపై యుద్దంలో మీ మాటలు స్ఫూర్తిగా నిలుస్తాయని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.