మారుతి పర్ఫెక్ట్ స్కెచ్‌ ఇదేనా !?

యువతరం దర్శకుడు మారుతి పర్ఫెక్ట్ స్కెచ్‌తో ఉన్నాడట. చిన్న సినిమాల నుంచి మీడియం రేంజి సినిమాకు ఎదిగిన మారుతి పెద్ద సినిమా దర్శకుల జాబితాలోకెళ్లే ప్రణాళికకు పదును పెడుతున్నాడు కలిసొస్తున్న కాలంలో కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడట. ఈ కసరత్తులు వర్కౌట్ అయతే స్టార్ హీరోతో సినిమా చేయడం ఖాయమేనంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

భలెభలె మగాడివోయ్ హిట్టు తరువాత మారుతి మూడేళ్లలో చేసిన నాలుగు సినిమాలు పల్టీకొట్టాయి. దాదాపుగా పడిపోయిన గ్రాఫ్‌ను ప్రతిరోజూ పండగే మళ్లీ నిలబెట్టింది. ఓ పెద్ద సినిమాను హ్యాండిల్ చేయగల స్టామినా మారుతికి ఉందని నిరూపించుకునే అవకాశాన్నీ ఇచ్చింది. ఆ ఊపులోనే పెద్ద హీరోలతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట మారుతి.

‘అడల్ట్’ అపవాదునుంచి బయటపడటానికి మారుతికి చాలా కాలమే పట్టింది. అయితే, ఇండస్ట్రీలో తన అడ్రెస్ చెప్పడానికే అప్పట్లో అలాంటి సినిమా చేయాల్సి వచ్చిందని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు మారుతి. అయితే, ‘అడల్డ్’ ఇమేజ్ చెరిపేశాక మాత్రం కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు బ్యాలెన్స్‌డ్ స్ట్రాటజీనే అమలు చేస్తున్నాడు. ఈ మధ్య మారుతి సందర్భోచితంగా ఓ విషయాన్ని ప్రసావిస్తున్నాడు కూడా.

అందులో ముఖ్యంగా మహేష్ ఎపిసోడ్. అదేంటంటే.. తనకొక కథ రాయమని హీరో మహేష్‌బాబు అడ్వాన్స్ ఇచ్చినా రాయలేకపోయాడట. ఎప్పుడు? ఎందుకు? ఎలా? అన్న విషయాన్నీ చెబుతున్నాడు మారుతి. మహేష్ బావ సుధీర్‌బాబుతో ‘ప్రేమకథా చిత్రమ్’ చేసి హిట్టుకొట్టాడు మారుతి. ఆ సక్సెస్‌కు ముచ్చటపడిన మహేష్.. మారుతికి ఓ చెక్ ఇప్పించి తనకూ మంచి కథ ప్రిపేర్ చేయమని అడిగాడట. అయినా మహేష్‌తో సినిమా చేసే ప్రయత్నాన్ని మారుతి ముందుకు తీసుకెళ్లలేదు.

మళ్లీ ఎందుకూ అంటే? మహేష్ స్థాయి హీరోని హ్యాండిల్‌చేసే స్టామినా తనకు అప్పటికి లేదని గ్రహించటంతో. అల్లు అర్జున్ సైతం తనతో సినిమా చేయమని అడిగినా , ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు ఇదే రీజన్ అనేక సందర్భాల్లో చెప్పాడు. అంటే పెద్ద హీరోలతో చేసిన సినిమా వర్కౌట్ కాకపోతే కెరీర్‌కే ప్రమాదమని గ్రహించడం మారుతి బ్యాలెన్స్‌డ్ స్ట్రాటజీయే అనుకోవాలి. 

మీడియం రేంజ్ సినిమాల దర్శకుడిగా బలమైన పునాథి వేసుకున్న తరువాతే భారీ బడ్జెట్లు, పెద్ద హీరోల గురించి ఆలోచించాలన్న జ్ఞానాన్ని అనుభవం నుంచి వంటబట్టించుకున్నాడు. అప్పటి విషయాలు ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నాడంటే భారీ బడ్జెట్లు, పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నానన్న సంకేతాలు ఇవ్వడానికి. తనకిప్పుడు ఆ స్టామినా ఉందన్న విషయాన్నీ చెప్పకనే చెబుతున్నాడు.

నిజానికి ప్రతిరోజూ పండగే చిత్రంతో మంచి హిట్టందుకున్న మారుతి తరువాతి ప్రాజెక్టుగా నిర్మాత దానయ్య కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రాజెక్టు చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్టుకు బడ్జెట్ భారీగానేవున్నా కొత్త హీరోతో ప్రయోగానికి మారుతి సిద్ధంగా లేడు. మంచి హిట్టుపడిన తరువాత మళ్లీ కొత్త హీరోతో సినిమా చేస్తే రేంజ్ ఏమాత్రం మారదన్నది మారుతికి తెలుసు. ఇది సరైన టైం కాదన్నది మారుతి యోచన. అందుకే నిర్మాత దానయ్య కొడుకును హీరోగా పరిచయం చేసే ప్రాజెక్టును పక్కన పెడుతున్నట్టు తెలుస్తోంది. మారుతి మైండ్ స్ట్రాటజీ వర్కౌటైతే మాత్రం.. స్టార్ డైరెక్టర్ కావడానికి ఎంతో టైమ్ పట్టదనటంలో సందేహం లేదు!?