బ‌న్నీ లుక్ ఇదేనా… అయితే ర‌చ్చే!

అల్లు అర్జున్

ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో అల్లు అర్జున్ ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగానూ రికార్డులు సృష్టించింది. `బాహుబ‌లి` త‌రువాత తెలుగు సినిమా ఈ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతుందా? అని ఆశ్చ‌ర్యంతో స‌గ‌టు ప్రేక్ష‌కుడు అవాక్క‌య్యేలా చేసింది.

ఈ సినిమా ఇచ్చిన జోష‌లో వున్న అల్లు అర్జున్ త‌న త‌దుప‌రి చిత్రానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ ఓ ఊర మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీగా నిర్మించ‌నున్న ఈ చిత్ర ఫ‌స్ట్ షెడ్యూల్ అల్లు అర్జున్ లేకుండా పూర్తియిపోయింది. రెండ‌వ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి వుంది.

క‌రోనా వైర‌స్ కార‌ణంగా కేర‌ళ‌లో మొద‌లుపెట్టాల్సిన షెడ్యూల్‌ని వాయిదా వేశారు. త్వ‌ర‌లోనే బ‌న్నీ పాల్గొన‌గా న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో కీల‌క స‌న్నివేశాల షూటింగ్ చేస్తార‌ని తెలిసింది. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా సాగ‌నుంది. త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ర‌ష్మిక హీరోయిన్‌. ఈ చిత్రానికి సంబంధించిన లారీ డ్రైవ‌ర్ లుక్ కోసం గ‌డ్డం, మీసం పెంచుతున్నాడు అల్లు అర్జున్‌.

తాజాగా అల్లు అర్జున్ లుక్ అంటూ ఓ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇదే ఫ‌స్ట్ లుక్ అంటూ, ఇదే అల్లు అర్జున్ గెట‌ప్ అంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఫ్యాన్ మేడ్ పోస్ట‌రే అయినా ఒరిజిన‌ల్‌ని త‌ల‌పిస్తుండ‌టంతో అంతా బ‌న్నీ లుక్ అదిరిపోయింద‌ని కామెంట్‌లు పెడుతున్నారు. సినిమాలో బ‌న్నీ లుక్ ఇదే అయితే ర‌చ్చే అంటున్నారు.