భారతీయ సినిమా రంగంలో డాక్టర్ దగ్గుబాటి రామా నాయుడు గారిది అరుదైన రికార్డు. అన్నీ భాషల్లో ఆయన సినిమాలు తీసి పద్మ భూషణ్ గా గౌరవం సంపాదించుకున్నారు. ఆయన హస్తవాసి మంచింది అందుకే ఆయన ద్వారా పరిచయం కావాలని చాలా మంది నటీనటులు కోరుకుంటారు.
వాన చినుకు ముత్యపు చిప్పలో పడితే ముత్యమే ప్రకాశిస్తుంది అంటారు. అలాగే రామా నాయుడు సినిమాలో చిన్న పాత్రలోనైనా కనిపించాలని ఆరాట పడేవారు, ఆశపడేవారు.
ఇవ్వాళ అందరు పద్మశ్రీ బ్రహ్మనందం చాలా గొప్ప నటుడు, ఈ తరంలో మేటి హాస్య నటుడు అని కీర్తిస్తున్నారు. అయితే బ్రహ్మ నందం భవిష్యత్తు బ్రహాండంగా ఉంటుందని మొదట చెప్పింది రామానాయుడు గారే.
స్వర్గీయ జంధ్యాల రామానాయుడు గారి కోసం ఓ హాస్య చిత్రాన్ని నిర్మించడానికి సంకల్పించారు. నాయుడు గారికి జంధ్యాల కథ కూడా వినిపించారు. రాజేంద్ర ప్రసాద్, రజని, కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, రాళ్ళపల్లి, సుత్తి వీరభద్ర రావు, వేలు,బాబు మోహన్, శుభలేఖ సుధాకర్ మొదలైన వారితో పాటు బ్రహ్మ నందం అనే నూతన నటుడిని అవకాశం ఇచ్చారు. అప్పటికి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పత్రాలు చేసినా పేరు రాలేదు, వేషాలు అంతంతమాత్రమే. అతని అదృష్టం బాగుండి జంధ్యాల దృష్టిలో పడ్డాడు.
కోట శ్రీనివాసరా దగ్గర పనిచేసే వాడి పాత్ర అది. ఆ సినిమా కోసం బ్రహ్మ నందం అరగుండు చేయించుకున్నాడు. పొట్టి చేతుల చొక్కా, నిక్కరు, చూడగానే నవ్వు వస్తుంది. 1987 మధ్యలో షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో షూటింగ్ అయిపోయాక కీసర గుట్ట గ్రామంలో కోట శ్రీనివాసరావు ఇల్లు, రామలింగేశ్వర స్వామి దేవాలయంలో క్లైమాక్స్ ప్లాన్ చేశారు.
తన సినిమా షూటింగ్ అయితే రామా నాయుడు గారు తప్పకుండా వుండాలీచిన్దే. ఆయన లేకుండా షూటింగ్ జరగడం నేను చూడలేదు. ఈ సినిమా కథ విన్నదగ్గర నుంచి నాయుడు గారు చాలా సంతోషంగా వున్నారు. క్రితం రోజు నేను నాయుడు గారిని కలవడానికి వారి స్టూడియోస్ వెళ్ళాను.
అప్పుడు నన్ను కీసర ఆహ్వానించారు. నాయుడుగారితో పాటు రెండవ రోజు ఉదయమే లొకేషన్ కు వెళ్ళాను. కీసరలో ఓ మండువా ఇంటిలో షూటింగ్ చేసిన తరువాత మధ్యాన్నం దేవాలయానికి యూనిట్ అంత వచ్చేసింది.
దేవాలయం బయట కుర్చీల్లో నాయుడు గారు, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, వీర భద్ర రావు నేను కూర్చొని వున్నాము.
దేవాలయం లోపల రాజేంద్ర ప్రసాద్, రజని తదితరులపై జంధ్యాల షూటింగ్ చేస్తున్నారు. అప్పుడే బ్రహ్మ నందం, గుండు హనుమంత రావు అటువైపు వెడుతూ కనిపించారు. రామా నాయుడు గారు “బ్రహ్మం” అని పిలిచాడు. ఆ పిలువు వినగానే బ్రహ్మ నందం పరిగెత్తుకుంటూ వచ్చాడు. చాలా వినయంగా చేతులు కట్టుకొని నుంచున్నాడు.
“ఇతను బ్రహ్మం .. సినిమాలో అరగుండు అంటారు, చాలా మంచి వేషం. ఇతను నటించిన రెండు సన్నివేశాలు రష్ చూశాను. కామెడీ అద్భుతంగా పండించాడు. ఈ అరగుండు బ్రహ్మం ఛాయా పెద్ద నటుడవుతాడు. ఆ లక్షణాలు నాకు బాగా కనిపించాయి ‘అని నాయుడు గారు నాకు చెప్పారు.
“భగీరథ గారు పెద్ద జర్నలిస్ట్ , నమస్కారం చెయ్యి” అన్నాడు నాయుడుగారు. బ్రహ్మ నందం రెండు చేతులు జోడించాడు.
“బ్రహ్మం ఇంటర్వ్యూ చెయ్యి” అని నాకు చెప్పారు నాయుడు గారు. “అలాగే సార్ “అని చెప్పాను. కోట శ్రీనివాసరావు కూడా బ్రహ్మనందానికి గొప్ప భవిష్యత్తు ఉందని చెప్పాడు.
ఈ “అహనాపెళ్ళంట” సినిమా 27 నవంబర్ 1987లో విడుదలైంది. నాయుడు గారు ఆశించినట్టే ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ చిత్రంలో అర గుండుగా నటించిన బ్రహ్మ నందం జీవితమే ఈ సినిమా మార్చేసింది. నిర్మాత రామానాయుడు గారు చెప్పిన మాటలను నిజమయ్యాయి.
– భగీరథ