ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ వున్నా హిట్టు కోసం శ్రమించాల్సిందే. ఇదే విషయాన్ని మరోసారి స్పష్లం చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ నటించిన తాజా చిత్రం `అల వైకుంఠపురములో` ఈ 12న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుసగా పలు మీడియా సంస్థలతో బన్నీ ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన అల్లు అర్జున్ చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తన కుటుంబం బంధుప్రీతికి బ్రాండ్ అంబాసిడర్ అని జోక్ చేసిన ఆయన వారసులు కూడా సినీరంగంలోకి రావడం అనేది ఇష్టం, సెంటిమెంట్‌పై ఆధారపడి వుంటుందని, మునుపటి తరాన్ని ఎంతగా అభిమానించారో.. తరువాతి తరాన్ని కూడా అంతగానే ఇష్టపడాలనుకుంటారని, దీన్నే కొందరు బంధుప్రీతి అంటారని, తన తండ్రి నిర్మాత కాబట్టి తనకు సినిమా రంగంలోకి ప్రవేశించడం సులువైందని, తొలి నాళ్లలో అది తనకు సహాయపడిందని, దాన్ని తాను ఖండించడం లేదని స్పష్టం చేశారు.
స్వయంగా ఎదిగిన నటులకు తాను గౌరవమిస్తానని, వారిని ప్రత్యేకంగా అభినందిస్తుంటానని, కానీ మా కష్టాలు మాకుంటాయనడం కూడా నిజమే అని అసలు విషయం చెప్పారు. మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నానని, ఆ కారణంగానే 18 నెలల విరామం ఏర్పడిందని, దీన్ని తాను ఊహించలేదని బన్నీ పేర్కొన్నారు.