ఇంద్రధనస్సులాంటి రంగుల ప్రపంచంలో వెండితెరపై వెలుగులు విరజిమ్మాలంటే ఆటుపోట్లు తప్పవు. ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ వుడ్ గురించి చెప్పుకున్నా ఇదే తంతు.. లైంగిక వేధింపులతో పాటు వర్ణ వివక్షను కూడా ఎదుర్కొన్నారు చాలామంది తారలు. తమ కెరీర్ కు ఎక్కడ బ్రేక్ పడుతుందోనని కొందరు.. అవకాశాలు దరిచేరాలంటే కొన్ని తప్పటడుగులు తప్పవని మరికొందరు.. ఇలా ఎవరికీ తోచిన విధంగా వాళ్లు తమ మనసులోనే హృదయాల్ని గాయపరుచుకున్నారు. ఇప్పుడిప్పుడే తమ మనసుల్ని తేలిక చేసుకొని అసలు విషయాలు బయటపెడుతున్నారు. ఇది ఎంతో మంచి పరిణామం అని ఇండస్ట్రీ పెద్దలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా కథానాయిక ఐశ్వర్యా రాజేశ్ మనసు విప్పింది. ఆమె మాటల్లోనే..
”కెరీర్ ఆరంభంలో నేనూ చాలా వేధింపులకు గురయ్యా. నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు. నల్లగా ఉన్నానని చాలా మంది అవహేళన చేశారు. నువ్వు హీరోయిన్ గా నిలదొక్కుకోలేవు అని ఓ ప్రముఖ దర్శకుడు అన్నారు. ఓ కమెడియన్ పక్కన వేషం ఇస్తాను.. చేస్తావా అని అడిగారు. అలాంటి ఎన్నో వేధింపులను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చా. ఉత్తరాది అమ్మాయిల తరహాలో ముస్తాబు కావడం, దుస్తులు వేసుకోవడం, ఎక్స్‌పోజింగ్ చేయడం నాకు రాదు. . అదీ ఓ సమస్యే. నేను తమిళం మాట్లాడానని కొంతమంది అవకాశాలు ఇవ్వకుండా తిరస్కరించారు. జీవితంలో లైంగిక వేధింపులు సహా అన్ని రకాల విమర్శలు, సమస్యలు ఎదుర్కొన్నాను. వేధించినవాళ్లకు, విమర్శకులకు సమాధానం చెప్పే సత్తా నాకు ఉంది. నేను బోల్డ్. మహిళలందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నా” అని ఐశ్వర్యా రాజేశ్ అన్నారు.
తెలుగులో ఒకప్పటి కథానాయకుడు, నటుడు రాజేశ్ కుమార్తె. హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు. ఎనిమిదేళ్ల వయసులో తండ్రిని కోల్పోవడంతో ఐశ్వర్యా రాజేశ్ కుటుంబం కష్టాలు పడింది. అక్కణ్ణుంచి కఠోర శ్రమ, కృషి, పట్టుదలతో దక్షిణాదిలో కథానాయికగా ఇవాళ ఓ స్థాయికి చేరుకున్నారు. ఐశ్వర్య తెలుగులో `కౌశల్యా కృష్ణమూర్తి`, `వరల్డ్ ఫేమస్ లవర్` వంటి చిత్రాల్లో నటించారు.