విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా రీమేక్ `నారప్ప`. ధనుష్ తమిళంలో నటించిన `అసురన్` చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబు నిర్మిస్తున్నారు. రీమేకా.. లేక జిరాక్స్ కాపీనా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. ఒక సినిమాని రీమేక్ చేస్తున్నారంటే దానికి మనవైన తళుకులు, మెరుపులు అద్ది తెరపైకి తీసుకొస్తుంటారు దర్శకులు కానీ `నారప్ప` విషయంలో అలాంటి వేవీ యాడ్ చేస్తున్నట్టు కనిపించడం లేదు.
ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ధనుష్ వాడిన తలపాగా కలర్ నుంచి లార్జ్ షర్ట్, పంచె వరకు యాజిటీజ్‌గా దించేశారు. కాస్ట్యూమ్స్ విషయంలోనూ ఎక్కడా లేడాని చూపించలేదు. బ్యాగ్రౌండ్ లొకేషన్‌తో సహా ఎక్కడా చిన్ని తేడాని కూడా పాటించలేదు. దీన్ని గమనించిన వారంతా `అసురన్`ని రీమేక్ చేస్తున్నారా లేక ఫ్రేమ్ టు ఫ్రేమ్ జిరాక్స్ కాపీ చేస్తున్నారా? అని అవాక్కవుతున్నారు. ఇప్పటికే ఈ కాపీ లుక్‌లపై సోషల్ మీడియాలో తెలుగు, తమిళ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది.
ఎంత రీమేక్ అయినా మరీ ఇంతలా మక్కీటూ మక్కీ దింపేయాలా, మన మార్కుని చూపించరా? అని తెలుగు ప్రేక్షకులు `నారప్ప` టీమ్‌పై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. గతంలో `3 ఇడియట్స్` చిత్రాన్ని శంకర్ `నన్బన్` పేరుతో రీమేక్ చేశాడు. స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి చిన్ని చిన్ని సెట్ ప్రాపర్టీ వరకు జిరాక్స్ కాపీ చేసి మరీ ఆ సినిమాని రీమేక్ చేస్తే దాన్ని రీమేక్ అని కాకుండా అంతా జిరాక్స్ కాపీ అని కామెంట్ చేశారు. ఇదే సినిమా తెలుగులో `స్నేహితుడు` పేరుతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో `అసురన్` చిత్రాన్ని `నారప్ప` అంటూ జిరాక్స్ చేస్తుండటం కొంత మంది తెలుగు వాళ్లకి నచ్చడం లేదు. మరి దీనిపై సురేష్ ప్రొడక్షన్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.