సంక్రాంతి బరిలో నిలిచిన అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` జోరు ఏమాత్రం తగ్గడం లేదు. త్రివిక్రమ్ మాటల గారడీతో ఈ సినిమా సంక్రాంతి రేసులో మొదటి స్థానాన్ని ఆక్రమించేసింది. వసూళ్ల పరంగా, టాక్ పరంగా మంచి పొజిషన్‌లో వున్న `అల వైకుంఠపురములో` నాన్ బాహుబలి రికార్డుల పరంగానూ ముందు వరుసలో నిలవడం విశేషం. రిలీజైన తొలి రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 26 కోట్ల షేర్‌ని రాబట్టిన ఈ చిత్రం తరువాత కూడా అదే ఊపుని కొనసాగిస్తోంది.
రెండవ రోజు కూడా వసూళ్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. 10 కోట్లకు తగ్గకుండా వసూళ్లని రాబడుతోంది. మూడవ రోజు 11 కోట్లు షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలనే విస్మయపరిచింది. వరుసగా పండగ సెలవులు కావడంతో ఎక్కడా ఆ ఊపు తగ్గడం లేదు. సంక్రాంతి రోజున ఏకంగా 11.28 కోట్లు వసూలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీంతో నాన్ బాహుబలి 2 రికార్డుని సాధించిన సినిమాగా రికార్డుని సాధించింది. తొలి నాలుగు రోజుల్లో వరుసగా 10 కోట్ల షేర్ సాధించిన చిత్రం `బాహుబలి 2`. తాజాగా ఈ జాబితాలో `అల వైకుంఠపురములో` చేరిపోయింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులకు గానూ నైజాంలో 17.95 కోట్లు, సీడెడ్ 9.25 కోట్లు, ఉత్తరాంధ్ర 7.92 కోట్లు, గుంటూరు 5. 94 కోట్లు, కృష్టా 5.38 కోట్లు, నెల్లూరు 2.35 కోట్లు.. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 59 కోట్లు వసూలు చేసి నాన్ బాహుబలి 2 రికార్డుని బద్దలు కొట్టింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 65 కోట్లకు బిజినెస్ అయిన ఈ చిత్రం త్వరలోనే బ్రేక్ ఈవెన్‌ని సాధించబోతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా 74 కోట్ల వరకు షేర్‌ని వసూలు చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో `అల వైకుంఠపురములో` మరిన్ని రికార్డుల్ని సమం చేయడం ఖయమని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.