నాని కోసం మ‌ళ్లీ ఎంసీఏ భామ‌?

వ‌రుస సినిమాల‌తో స్పీడు పెంచారు నేచుర‌ల్ స్టార్ నాని. ఇప్ప‌టికే రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న ఆయ‌న తాజాగా మ‌రో చిత్రాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి` చిత్రంలో విల‌న్ షేడ్స్ వున్న పాత్ర‌లో న‌టిస్తున్న నాని ఈ సినిమాతో పాటు శివ నిర్వాణ‌తో క‌లిసి `ట‌క్ జ‌గ‌దీష్‌`ని కూడా మొద‌లుపెట్టేశాడు.

ఇందులో వెరైటీ మేన‌రిజ‌మ్స్‌తో ఆక‌ట్టుకోబోతున్న నాని ఇప్ప‌టికే తొలి షెడ్యూల్‌ని పూర్తిచేసి రెండ‌వ షెడ్యూల్‌కు రెడీ అయిపోతున్నాడు. ఇదిలా వుంటే తాజాగా `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ వెరైటీ చిత్రానికి ఓకే చెప్పిన విష‌యం తెలిసిందే. నానితో `జెర్సీ` చిత్రాన్ని నిర్మించిన సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ తాజా చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి `శ్యామ్ సింగ రాయ్‌` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని, రిలీజ్ డేట్‌ని కూడా టీజ‌ర్ రూపంలో రిలీజ్ చేశారు.

మేలో రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేసి చిత్రాన్ని డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో నానికి జోడీగా క్రేజీ లేడీ వుండాల‌ని, అది కూడా న‌టిన‌కు ఆస్కార‌మున్న పాత్ర కావ‌డంతో సాయిప‌ల్ల‌వి అయితేనే బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ఆమెతో చిత్ర బృందం సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం, ఆమె ఓకే చేయ‌డం కూడా జ‌రిగిపోయింద‌ని, త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌నున్నార‌ని తెలిసింది. ఇంత‌కు ముందు నానితో క‌లిసి సాయి ప‌ల్ల‌వి `ఎంసీఏ` చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే.