నాగశౌర్యకు బ్యాడ్‌టైం నడుస్తోంది గురు!?

ఎదురులేకుంటే అదృష్టం.. ఎదురుదెబ్బ తగిలితే గడ్డుకాలం  అన్నది ఇండస్ట్రీ సెంటిమెంట్. రెంటికీ కొలమానం కాలమే అయినా.. మంచీ, చెడుగా విశ్లేషించటం పరిపాటి. ఇండస్ట్రీ లెక్కల్లో చూస్తే మాత్రం హీరో నాగశౌర్యకు బ్యాడ్‌టైం నడుస్తోంది. తను రాసుకున్న అశ్వథ్థామ పోయింది. తనకు హిట్టునిచ్చిన దర్శకుడు వెంకీతో గొడవొచ్చింది. తనకు జోడీగా నటించిన మెహ్రీన్ కౌంటర్ల మీద కౌంటర్లేస్తోంది. వెరసి -శౌర్య టైం బ్యాడ్డైంది.
 
దెబ్బమీద దెబ్బతో స్థిమితం లేకుండాపోయింది. తప్పొప్పుల విశే్లషణను పక్కనపెడితే -ఎన్’కౌంటర్లతో నాగశౌర్య డిఫెన్స్‌లో పడిపోయాడన్నది కాదనలేని నిజం. హీరో బలహీన పడితే -క్రైసిస్ కౌంటర్ అటాక్ చేస్తుందన్నట్టు.. శౌర్య చేతిలో వున్న ఒక్క సినిమా క్యాన్సిలైందంటూ కథనాలు ఊపిరి పోసుకోవడంతో పరిస్థితి మరింత దారుణమైంది. ‘అశ్వథ్థామ’కు పార్లల్‌గా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో శౌర్య సినిమా మొదలెట్టాడు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యోఅచ్యుతానంద’ చిత్రాల్లో శౌర్యకు చోటిచ్చిన అవసరాల -అతనితో హ్యాట్రిక్ ప్రాజెక్టు చేస్తున్నాడు. అయితే సినిమా ఆగిపోయిందని, శౌర్యే సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడన్న ప్రచారం మొదలైంది.
 
ఈ ప్రచారాలపై నిర్మాత వివేక్ కూచిభొట్ల సోషల్ మీడియాలో ఓ క్లారిటీ ఇచ్చాడు. సినిమా ఆగిపోయిందన్న ప్రచారం అబద్ధమని.. 50 శాతం షూటింగ్ పూరె్తైన సినిమాకు వీసాల సమస్యతో విదేశీ షెడ్యూల్‌కు బ్రేక్ పడిందని క్లారిటీ ఇచ్చాడు. చాలా సినిమా కథల్లో కథానాయకులు తెలీకుండా కొన్ని పొరబాట్లు చేసి క్రైసిస్‌లో పడతారు. కానీ, కథ క్లైమాక్స్‌కు చేరేసరికి హీరో నిలబడటం ఖాయం కనుక -క్రైసిస్‌ను ఎదుర్కోవడంలో శౌర్య ఎలాంటి హీరోయిజం చూపిస్తాడో వేచి చూడాలి. దర్శకుడు అవసరాల పనితనంపై ఇండస్ట్రీకి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కనుక -శౌర్యకు ‘లిఫ్ట్’ ఇస్తాడేమో చూద్దాం.