త‌రుణ్‌భాస్క‌ర్ ఇలా షాకిచ్చాడేంటి?

టాలీవుడ్‌కు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని హీరోగా అందించిన త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడిగా సినిమా చేసి దాదాపు రెండేళ్ల‌వుతోంది. `మీకు మాత్ర‌మే చెప్తా` అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎలా హ‌డావిడిగా ఈ మూవీ థీయేట‌ర్ల‌లోకి వ‌చ్చిందో అలాగే వెళ్లిపోయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా నిర్మించిన ఈ సినిమా చేదు ఫ‌లితాన్నే అందించింది. దీని త‌రువాత త‌రుణ్ డైరెక్ట‌ర్‌గా సినిమా వ‌స్తుంద‌ని అంతా భావించారు. వెంకీ హీరోగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో సినిమా అని ప్ర‌చారం జ‌రిగింది.

క‌ట్ చేస్తే వెంక‌టేష్ మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి`వెంకీమామ` చేశాడు. ఆ త‌రువాత అయినా చేస్తాడా? అంటే ఇప్పుడేమో త‌మిళ సినిమా `అసుర‌న్` రీమేక్ `నార‌ప్ప‌`లో న‌టిస్తున్నాడు. దీంతో త‌రుణ్‌భాస్క‌ర్ మ‌న‌సు మార్చుకుని ఈటీవీ ప్ల‌స్ కోసం రియాలిటీ షో చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. `నీకు మాత్ర‌మే చెప్తా` పేరుతో ఈ షోని 25 ఎపిసోడ్‌లు ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ని ఇన్‌స్టా గ్రామ్‌లో త‌రుణ్ భాస్క‌ర్ శనివారంషేర్ చేయ‌డంతో త‌రుణ్ భాష్క‌ర్ ఏంటీ ఇలా షాకిచ్చాడ‌ని అవాక్క‌వుతున్నారు.