ఒక సినిమా నుంచి హీరో లేదా హీరోయిన్ తప్పుకోవడం అన్నది సినీ ఇండస్ట్రీలో కామన్. కానీ ఇక్కడ మాత్రం కామన్ కాదు. ఇది మెగాస్టార్ చిరంజీవి సినిమా. అందులోనూ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్న సినిమా. దీని నుంచి ఓ హీరోయిన్ అర్థాంతరంగా తప్పుకోవడం అంటే అవమానం జరిగినట్టే. కొరటాల శివ దర్శకత్వంలో చిరు హీరోగా రామ్‌చరణ్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ హీరోయిన్ లేకుండానే ఇన్నాళ్లూ జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిషని ఖరారు చేసుకున్నారు. కానీ మీడియాకు మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే వుంచారు.
తాజాగా త్రిష ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించింది. అసలే ప్రకటించని హీరోయిన్ `కొన్ని విషయాలు మారిపోతుంటాయి. ముందు ఒకలా తరువాత మరోలా .. క్రియేటివ్ అంశంలో భిన్నాభిప్రాయాల చిరంజీవి సర్ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నా. యూనిట్‌కి అభినందనలు. ఆల్ ద బెస్ట్` అని త్రిష ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సినిమా కోసం తీసుకున్న త్రిషను ఈ ప్రాజెక్ట్‌కు హీరోయిన్‌గా ఎందుకు ప్రకటించలేదు?. కేవలం త్రిషను ఆప్షన్‌గానే పెట్టుకున్నారా? అందుకే ఆమెని హీరోయిన్‌గా ప్రకటించలేదా?. ఓ పథకం ప్రకారమే మరో హీరోయిన్ లభించని పక్షంలో మాత్రమే త్రిషని ఈ చిత్రంలో తీసుకోవాలని హోల్డ్‌లో పెట్టారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
త్రిష ఆప్షన్ అయితే చిరు పక్కన హీరోయిన్‌గా ఎవరిని అనుకున్నారు? అనుకుంటే ఆ హీరోయిన్ ఎవరు? ఇలా చేయడం ఓ సీనియర్ హీరోయిన్‌గా త్రిష అవమానంగా భావించడం వల్లే తప్పుకుంటున్నానని ప్రకటించిందనే వాదన ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.