తెలుగు రాష్ట్రాల్లో మూత పడనున్న సినిమా థియేటర్లు!?

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వల్ల ఇప్పటికే వాణిజ్య, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. అనేక ప్రాంతాల్లో పర్యాటక రంగం వెలవెలబోతోంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ టాలీవుడ్‌పై కూడా భారీగా పడేట్లు తెలుస్తోంది. కరోనాకు భయపడి చాలా మంది సినీ హీరోలు, ప్రముఖులు ఇప్పటికే షూటింగ్‌లు రద్దుచేసుకుంటుంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు కూడా తాత్కాలికంగా మూతపడనున్నాయనే టాక్ వైరల్ అవుతోంది.

తెలంగాణలో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ప్రజలు బయట తిరగడానికే భయపడుతున్నారు. ప్రయాణాలు కూడా మానుకుంటున్నారు. ప్రభుత్వం కూడా వైరస్ వ్యాప్తి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సినిమా థియేటర్లను కొద్ది రోజులు మూసేయ్యాలని చిత్రపరిశ్రమ భావిస్తోందట. అందుకే షూటింగ్‌లను కూడా కొద్దికాలం ఆపెయ్యాలని నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మేరకు గురువారం సాయంత్రం ఫిల్మ్‌ఛాంబర్‌లో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారట. ఈ సమావేశంలో షూటింగ్‌ల రద్దు, థియేటర్లు మూసివేయడంపై నిర్ణయం తీసుకోకున్నారని తెలుస్తోంది.

ఇదే జరిగితే టాలీవుడ్ కొద్దికాలం మూగబోనుంది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని షూటింగులు రద్దవుతాయి. అలాగే థియేటర్లు కూడా మూగబోతాయి.