సమంత, శర్వానంద్, వెన్నెల కిషోర్, వర్షా బొల్లమ్మ, రఘుబాబు, శరణ్య ప్రదీప్, సాయి కిరణ్ కుమార్, గౌరీ గీతా కిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : ప‌్రేమ్‌కుమార్
నిర్మాత : దిల్ రాజు
మాటలు : మిర్చి కిరణ్
సంగీతం : గోవింద్ వసంత
ఫొటోగ్రఫీ : మహేందిర జయరాజు
ఎడిటింగ్ : ప‌్రవీణ్ కె.ఎల్
విడుదల తేదీ : 7-02-2020
రేటింగ్ : 3.5
ఫీల్‌గుడ్ కథల్ని వెతికి పట్టుకోవడంతో దిల్ రాజు మాస్టర్. అదే ఆయనని టాప్ ప్రొడ్యూసర్గా నిలిబెట్టింది. అభిరుచిగల నిర్మాతగా మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఒక బొమ్మరిల్లు, ఒక కొత్త బంగారు లోకం, బృందావనం, మిస్టర్ పర్‌ఫెక్ట్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి, ఫిదా వంటి ఫీల్ గుడ్ చిత్రాల్ని అందించారు. అదే కోవలో దిల్ రాజు అందించిన మరో ఫీల్ గుడ్ ప్రేమ కావ్యం `జాను`. 17 ఏళ్ల సినీ కెరీర్‌లో దిల్ రాజు నిర్మించిన తొలి రీమేక్ ఇదే కావడం విశేషం. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా రూపొందిన `96` అక్కడ సంచలన విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలతో పాటు త్రిషకు 11 అవార్డుల్ని అందించింది. ఎంత రీమేక్ చేసినా సోల్‌ని మాత్రం అంతే పక్కాగా క్యారీ చేయలేరనే పేరుంది. అయితే ఈ సినిమా విషయంలో అదే జరిగిందా?. లేక మ్యాజిక్ చేశారా? జానుగా సమంత, రామ్‌గా శర్వానంద్ తమిళ మాతృకని మరిపించే స్థాయిలో మెస్మరైజ్ చేశారా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
ప్రతీ ఒక్కరి జీవితంలో స్కూల్ డేస్‌లో ఓ ప్రేమకథ ఖచ్చితంగా వుంటుంది. ఆ సమయంలో ఇష్టపడిన వారితో మాట్లాడాలని, వాళ్లని ఇంప్రెస్ చేయాలని, తనని గొప్పగా ఓ హీరోలా చూసుకునేలా చేయాలని తపన పడని వారంటూ వుండరు. అలా తపన పడిన రామ్(శర్వానంద్), జాను (సమంత) తాము ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నామని తెలిసి ఆ విషయాన్ని చెప్పుకునే లేపే విడిపోతారు. దాదాపు 17 ఏళ్ల తరువాత ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ పార్టీలో మళ్లీ కలుసుకుంటారు. అప్పుడు వారి హృదయాల్లో ఏర్పడిన మానసిక సంఘర్షణల సమాహారమే ఈ సినిమా. స్కూల్ డేస్‌లో రామ్, జాను ఎందుకు తమ ప్రేమని వ్యక్తం చేసుకోలేకపోయారు? దఆనికి దారి తీసిన పరిస్థితులేంటీ? ఆ విసయం తెలిసిన తరువాత జాను పడే మానసిక సంఘర్షణ ఏంటి?. ఈ క్రమంలో వారి మధ్య ఎలాంటి భావోద్వేగాలు చోటు చేసుకున్నాయి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు:
తమిళ మాతృకలో జాను పాత్రని త్రిష అద్భుతంగా పండించింది. ఆ స్థాయిని మించి చేయాలంటే సమంతకు ఓ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఆ ఛాలెంజ్‌ని స్వీకరించిన సామ్ జాను పాత్రని అత్యద్భుతంగా పండించి ఔరా అనిపించింది. చైల్డ్ ఎపిసోడ్‌లో మాతృకలో నటించిన గౌరీ గీతా కిషన్ నటించింది. యంగ్ శర్వాగా సాయి కిరణ్ కుమార్ కనిపించాడు. స్కూల్ డేస్ ఎపిసోడ్‌ని పక్కన పెడితే మిగతా భాగాన్ని సమంత నడిపించింది. శర్వానంద్ వున్నా ఈ సినిమాకి ప్రధాన ఎస్సెట్ తానే అనిపించింది. అంతగా పాత్రని రక్తికట్టించింది. భావోద్వేగ సన్నివేశాల్లో, శర్వాతో కలిసి వచ్చే సన్నివేశాల్లో సమంత నటన ఖచ్చితంగా ప్రేమికుల చేత కంటతడి పెట్టిస్తుంది. తొలి ప్రేమ అనుభూతుల్ని, జ్ఞాపకాల్ని మరొక్కసారి ప్రేమికులు గుర్తు చేసుకంటారు. ఈ సినిమాలో సామ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనని ప్రదర్శించింది అనొచ్చేమో.
శర్వానంద్ ఇందులో రామ్‌గా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా కొత్త తరహా పాత్రలో కనిపించాడు. పాత్ర పరిధి మేరకు డైలాగ్స్ చాలా తక్కువే అయినా హావ భావాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. గెట్ టు గెదర్ సన్నివేశాల్లో సామ్‌తో వచ్చే సన్నివేశాల్లో సింప్లీ సూపర్బ్ అనిపించాడు. అయితే సమంత పాత్రతో పోలిస్తే శర్వా పాత్రకు ఆ స్థాయి స్కోప్ దక్కలేదు. కథలో కూడా తన పాత్రకి అంత డెప్త్ లేదు. ఇక మిగతా పాత్రల్లో
వెన్నెల కిషోర్, వర్షా బొల్లమ్మ, రఘుబాబు, శరణ్య ప్రదీప్ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు. స్కూల్ ఎపిసోడ్‌లో సాయి కిరణ్ కుమార్, గౌరీ గీతా కిషన్ కట్టిపడేశారు.
సాంకేతిక వర్గం:
ఇలాంటి ప్రేమకథలకు ప్రాణం సంగీతం, సినిమాటోగ్రఫీ. ఈ విషయంలో గోవింద్ వసంత, మహేందిర జయరాజు నూటికి నూరు మార్కులు కొట్టేశారు. తొలి ప్రేమలోని మధురానుభూతుల సమాహారంగా రూపొందిన ఈ చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్ కథ చెప్పేలా మహేందిర జయరాజు ఫొటోగ్రఫీ వుంది. అంతలా ఆయన ఈ చిత్రానికి కనెక్ట్ అయి చేశారు. ఇక ప్రేమ భావనల్ని పలికించి ప్రేమలోకంలో విహరించేలా ఫీల్ క్రియేట్ చేసేది సంగీతమే ఆ విషయంలో గోవింద్ వసంత కూడా సక్సెస్ అయ్యాడు. తమిళ చిత్రంలోని `కాదలే కాదలే…ని తెలుగులో అదే స్థాయిలో రీ క్రియేట్ చేసి మళ్లీ మ్యాజిక్ చేశాడాయన. నరేషన్ స్లోగా వుండటం ఈ సినిమాకి ఓ మైనస్. `96` స్క్రీన్‌ప్లేనే ఫాలో అయినా కథనంలో వేగం పెంచి వుంటే బాగుండేది. ఈ విషయంలో ఎడిటర్ కె. ఎల్ ప్రవీణ్ మరింతగా ఆలోచిస్తే బాగుండేది. తమిళ మాతృకని యాజిటీజ్‌గా రీమేక్ చేసినా తెలుగులో దర్శకుడు ప్రేమ్ కుమార్ `96` స్థాయిలో మాత్రం మయాజిక్ చేయలేకపోయాడని చెప్పొచ్చు.
విశ్లేషణ:
ఇలాంటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీలని రీమేక్ చేయడం పెద్ద రిస్క్‌తో కూడుకున్న పని. సోల్ మిస్సయినా.. మ్యాజిక్ రిపీట్ కాదు. అందుకని ఆ సెన్సిబిలిటీస్‌ని జాగ్రత్తగా హ్యాండీల్ చేస్తూ రీమేక్‌ని చేయాలి. కానీ `జాను` విషయంలో అది 100 శాతం జరగనట్టు కనిపిస్తోంది. కథని రీమేక్ చేశారే కానీ సోల్ మాత్రం మరిచినట్టు తెలుస్తోంది. తమిళ ప్రేక్షకులకు లాగ్‌లు, స్లో నరేషన్ ఎక్కాయి కానీ తెలుగులో మాత్రం అదే స్లోనరేషన్ బోర్‌గా మైనస్‌గా మారే అవకాశం వుంది. ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే ఫలితం మరింత మెరుగ్గా వుండేదేమో. ఓవరాల్‌గా చెప్పాలంటే `జాను` సమంత షో. ప్రతీ ప్రేమికుడికి తన తొలి ప్రేమ జ్ఞాపకాల్ని మరోసారి గుర్తుచేసి ఆ కాలంలో విహరించేలా చేస్తుంది. ప్రేమని పోగొట్టుకున్న వాళ్లు ప్రేమించాలనకుంటున్న వాళ్లు ఖచ్చితంగా ఈ చిత్రాన్ని ఇష్టపడతారు. వేలం వెర్రిగా చూస్తారు కూడా. నవ యువ ప్రేక్షకులతో పాటు ఒక నాటి ప్రేమ జంటల్ని, విడిపోయిన ప్రేమికులకు అమితంగా నచ్చే సినిమా ఇది.