క‌రోనా విల‌యం: సుర‌భి క‌ళాకారుల్ని ప్ర‌భుత్వాలు గాలికొదిలేశాయా?

క‌రోనా విల‌యం: సుర‌భి క‌ళాకారుల్ని ప్ర‌భుత్వాలు గాలికొదిలేశాయా?

క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల న‌గ‌రాల నుంచి వ‌ల‌స కార్మికులు స్వ‌స్థ‌లాల‌కు కాలిన‌డ‌క‌న బ‌య‌ల్దేరుతున్న స‌న్నివేశాలు చూస్తుంటే హృద‌యాన్ని క‌ల‌చివేస్తున్నాయి. ఇక నిరంత‌రం స్టేజీలెక్కి నాట‌కాలాడితే కానీ పొట్ట పోషించుకోలేని క‌ళా బృందాల ప‌రిస్థితేమిటి? రాజ‌కీయ నాయ‌కులు పంచే ఆపాత్ర‌దాన ఆహార పొట్లాల‌తో ఎన్నాళ్లు స‌ర్ధుకోవాల్సి ఉంటుంది?

స్టేజీ డ్రామానే న‌మ్ముకుని పొట్ట పోషించుకునేవాళ్ల‌కు లాక్ డౌన్ గ‌డ్డుకాలంగా మారింది. ఇత‌ర కాంప్లెక్సుల్లానే థియేట‌ర్లు అన్నీ మూత వేసేసారు. సినిమాల‌కు.. డ్రామాల‌కు ఆస్కారం లేకుండా పోయింది. దీనివ‌ల్ల సినీకార్మికులు.. క‌ర్ష‌క‌ కళాకారులు క‌నీసం తిండికి మొహం వాయాల్సిన ప‌రిస్థితి. ఇదే ప‌రిస్థితి సుర‌భి క‌ళాకారుల‌కు రావ‌డంతో వారు ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేసిన ఓ వీడియో అంత‌ర్జాలంలో అల‌జ‌డి రేపింది. ద‌శాబ్ధాల చ‌రిత్ర ఉన్న సుర‌భి నాట‌క క‌ళాకారుల‌కు ఇంత‌టి క‌ష్ట‌మా? అంటూ హృద‌యాలు చ‌లించిపోయాయి. అయితే క‌ళాకారుల‌కు ప్ర‌భుత్వం నుంచి ఫించ‌ను అమ‌ల్లో ఉంటుంది. ఈ క‌రోనా మ‌హమ్మారీ లాక్ డౌన్ స‌మ‌యంలో సుర‌భి డ్రామా కంపెనీ వాళ్ల‌కు ప్ర‌భుత్వాలు ఫించ‌ను ఇచ్చాయా లేదా? అన్న‌ది కూడా అర్థం కాని స‌న్నివేశ‌మే. ఇటు ఏపీ ప్ర‌భుత్వం అటు తెలంగాణ ప్ర‌భుత్వం సుర‌భి క‌ళాకారుల్ని ఆదుకునేందుకు ఏం చేస్తున్నాయి? అన్న‌ది కూడా అర్థం కాని స‌న్నివేశం ఉంది.

అయితే నాట‌కాల‌తో విశేష అనుబంధం ఉన్న డైర‌క్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ సుర‌భి కళాకారుల్ని ఆదుకోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఆయ‌న ఏకంగా 81 బ‌స్తాల నిత్యావ‌స‌రాల్ని సుర‌భి క‌ళాకారుల‌కు పంపిణీ చేశారు. ఆ మేర‌కు త‌న జ‌ర్న‌లిస్ట్ ఫ్రెండ్ ఏబీఎన్ (ప్ర‌స్తుతం టీవీ5) మూర్తి ఆ సంగ‌తిని వెల్ల‌డించారు. సుర‌భి క‌ళాకారుల వెత‌లకు సంబంధించిన వీడియోని ఆయ‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. ఈ క‌ష్ట కాలంలో హ‌రీష్ ఆదుకున్నందుకు సుర‌భి క‌ళాకారులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇక క‌ళాకారుల కుటుంబానికి ఇంత‌టి క‌ష్టం క‌ల‌గ‌డంపై హ‌రీష్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హ‌రీష్ మంచి ప‌నికి స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.