టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. గత కొన్నేళ్లుగా కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్లు ప్రస్తుతం పక్కకు తప్పుకుంటున్నారు. సొంతంగా ప్రొడక్షన్ కంపనీలు ప్రారంభిస్తున్నారు. దిల్ రాజు కాంపౌండ్‌లో గత 17 ఏళ్లకు మించి వున్న లక్ష్మణ్ తాజాగా వేరు కుంపటి పెట్టుకోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. డిస్ట్రిబ్యూటర్‌గా దిల్ రాజుకు ఆయన నైజాంలో త్వరలో గట్టి పోటీని ఇవ్వబోతున్నారు. ఇప్పటికే పవన్‌స్టార్‌తో క్రిష్ రూపొందిస్తున్న సినిమా నైజాం హక్కుల్ని సొంతం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
తాజాగా మరో భారీ నిర్మాణ సంస్థ నుంచి మరో నిర్మాత సైడవ్వడం ఆసక్తికర చర్చకు తెరలేపింది. టాలీవుడ్‌లో భారీ చిత్రాలకు ఆర్కా మీడియా, యువీ, గీతా ఆర్ట్స్ తరువాత నిచిలిన సంస్థ మైత్రీ మూవీమేకర్స్. ఒక విధంగా ఈ మధ్య కాలంలో మైత్రీ నిర్మించినన్ని చిత్రాలు ఏ నిర్మాణ సంస్థ నిర్మించలేదు. ఈ సంస్థలో నవీన్ యెర్నేని, రవిశంకర్, సివి. మోహన్ నిర్మాతలు. `శ్రీమంతుడు` చిత్రంతో 2015లో వీరి ప్రయాణం మొదలైంది.
ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని అందించిన ఈ నిర్మాతల త్రయం విడిపోతున్నారు. త్వరలో బాలీవుడ్‌లో సినిమాలు నిర్మించాలని ప్లాన్ వేశారు. అయితే ఈ ముగ్గురు నిర్మాతల్లో సీవీ మోహర్ మాత్రం హిందీ చిత్రాల నిర్మాణానికి భాగస్వామిగా కొనసాగడం లేదు. దీంతో మిగతా ఇద్దరు ఓ బాలీవుడ్ నిర్మాతతో కలిసి మైత్రీ మూవీమేకర్స్ 2 పేరుతో హిందీ సినిమాల నిర్మాణం చేపడతారట. తొలి చిత్రంగా సల్మాన్‌ఖాన్‌తో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసినట్టు తెలిసింది. సల్మాన్ ఓకే చెప్పడమే ఆలస్యం సినిమా మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.