కేసీఆర్ ఆఫర్ రిజెక్ట్ చేసిన దగ్గుబాటి సురేష్

డా.డి.రామానాయుడు తనయుడు, తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్న వెంకటేష్ అన్న బడా నిర్మాత సురేష్ బాబు కేసీఆర్ ఇచ్చిన ఒక ఆఫర్ రిజెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ సీఎం ఇచ్చిన, సురేష్ బాబు తిరస్కరించిన ఆఫర్ సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి పథంలో నడిపించాలి అనుకుంటున్నారట మన కేసీఆర్ సారు. దీనికోసం ఒక కొత్త ప్లాన్ వేశారు. సినిమా ఇండస్ట్రీ స్థాయిని అమాంతం పెంచేయటానికి ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారట. చర్చలు పూర్తయ్యాక దగ్గుబాటి వారి పెద్దబాబుకి ఒక సలహా ఇచ్చారట. కానీ సురేష్ బాబు మాత్రం సారీ చెప్పి సున్నితంగా తిరస్కరించారట.

ఇండస్ట్రీలో అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ బాగా ఫేమస్. అయితే వాటి పేరుతో కమర్షియల్ సెంటర్స్ స్టార్ట్ చేయమని, అందుకు కావాల్సిన భూమిని హైదరాబాద్ శివార్లలో ఇప్పిస్తామని సలహా ఇచ్చారట సురేష్ బాబుకి కేసీఆర్. అయితే తన తండ్రి గుర్తుగా ఉన్న రామానాయుడు స్టూడియోస్ ని అలా మార్చటం ఇష్టం లేక నిరాకరించారట సురేష్ బాబు. ఈ వార్తలో వాస్తవమెంత? అవాస్తమెంత? అని చర్చ జరుగుతున్న తరుణంలో సురేష్ బాబు కూడా స్పందించారు. రామానాయుడు స్టూడియోస్ ని కమర్షియల్ సెంటర్స్ గా మార్చడంపై తన మనసులోని మాటను తెలియజేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి తనకి ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. రామానాయుడు స్టూడియోస్ స్థాపించడం తమ తండ్రి కలగా చెప్పారు. దాని నిర్మాణం అంత సులువుగా కాలేదని, దాని కోసం మా నాన్నగారు ఎన్నో కష్టాలు పడ్డారని వివరించారు. ఆయన జ్ఞాపకార్థముగా ఈ స్టూడియోని ఎప్పటికీ ఇలాగే ఉంచుతామని, దీనికి మార్పులు చేసే ఆలోచనలు మాకు లేవని స్పష్టం చేశారు.

తమిళనాడు నుండి తెలుగు ఇండస్ట్రీని హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తున్న సమయంలో అప్పటి ఏపీ గవర్నమెంట్ సహకారంతో రామానాయుడు స్టూడియోస్ ని నిర్మించారు డా.డి.రామానాయుడు. రామానాయుడు స్టూడియోస్ లో ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన అన్ని విభాగాలు ఒక్కొక్కటిగా అభివృద్ధి చేశారు. రామానాయుడు చనిపోయిన తర్వాత స్టూడియో వ్యవహారాలన్నీ సురేష్ బాబు దగ్గరుండి చూసుకుంటున్నారు.