టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ తో దక్షిణాదిలో, ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్ ‘కబీర్‌సింగ్’ తో బాలీవుడ్ లో స్టార్‌డమ్ సొంతం చేసుకుంది పంజాబీ సుందరి కియారా అద్వాణీ. కెరీర్ తొలినాళ్లలో అవకాశాలపరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్న ఈ బ్యూటీ ‘కబీర్‌సింగ్’ విజయం ఆమె వ్యక్తిత్వాన్ని సానుకూలంగా ప్రభావితం చేసిందట.
ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. విజయాల్లోనే వినమ్రంగా ఉండటం అలవర్చుకోవాలి. కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది కాబట్టే .. విజయం ఎంత విలువైనదో బాగా తెలుసుకుంది. అనుక్షణం దానిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. సెట్స్‌లో ఎంత బిజీగా ఉన్నా.. అభిమానులు సెల్ఫీ అడిగితే ఎప్పుడూ కాదనదట.
ఒకప్పుడు సినిమా ఫలితం ఎలా ఉంటుందోనని భయం కలిగేదని, ఇప్పుడు రిజల్ట్ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా తన పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయడంపైనే దృష్టిపెడుతున్నానని చెబుతోంది. నేను ‘తప్పనిసరిగా నటించాలి’ అనుకునే హీరో రణ్‌వీర్‌సింగ్. అతడే దమ్మున్న హీరో అని చెప్పింది. ప్రస్తుతం కియారా అద్వాణీ హిందీలో ‘లక్ష్మీబాంబ్’, ‘ఇందూ కి జవానీ’, ‘షేర్షా’, ‘బూల్ బులయ్యా-2’ చిత్రాలలో నటిస్తోంది.