ఏయిర్‌పోర్ట్‌లో ఆడియో ఫంక్ష‌న్‌!

విల‌క్ష‌ణ చిత్రాల హీరోగా సూర్యకు మంచి పేరుంది. `శివ‌పుత్రుడు` సినిమా నుంచి ఆయ‌న అదే పంథాను కొన‌సాగిస్తున్నారు. క‌మ‌ల్‌, విక్ర‌మ్‌ల త‌రువాత ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టించిన హీరోగా సూర్య‌ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. గ‌త కొంత కాలంగా ఎన్ని ప్ర‌యోగాలు చేసినా ఆయ‌న‌కు క‌లిసి రావ‌డం లేదు. పేరున్న డైరెక్ట‌ర్‌ల‌తో సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోతున్నాయి.

తాజాగా సూర్య చేస్తున్న మ‌రో ప్ర‌యోగం `సూరరాయి పోట్రు`. `గురు` ఫేమ్ సుధా కొంగ‌ర ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` పేరుతో తెలుగులో రిలీజ్ చేయ‌బోతున్నారు. సూర్య న‌టిస్తూ ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఏయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ జి.ఆర్‌. గోపీనాథ్ జీవిత క‌థ స్ఫూర్తితో ఈ సినిమా రూపొందుతోంది. ఏప్రిల్ 9న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. క‌థ‌కు త‌గ్గ‌ట్టే ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌ని కూడా డిఫ‌రెంట్‌గా చేయ‌బోతున్నారు. అనూహ్యంగా చెన్నై ఇంట‌ర్నేష‌న‌ల్ ఏయిర్‌పోర్ట్‌లో ఆడియో లాంచ్ కార్య‌క్ర‌మాన్ని వినూత్నంగా నిర్వ‌హించ‌బోతున్నారు. ఇలా ఓ సినిమా ఆడియో ఫంక్ష‌న్ ఏయిర్‌పోర్ట్‌లో చేయ‌డం ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో ఇదో తొలిసారి కావ‌డం విశేషం.