ఏంరో, నన్ను సూస్తివా? – వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ మూవీ ట్రైలర్ రివ్యూ!
గుబురు గడ్డం పెంచుకుని, మాస్ లుక్ తో భయంకర బందిపోటులా వున్నవరుణ్ తేజ్ ‘వాల్మీకి’ ట్రైలర్ ఫుల్ రేంజి యాక్షన్ థ్రిల్లర్ ని ప్రేక్షకుల ముందు వుంచుతోంది… వరుణ్ తేజ్ ఉగ్రరూపం, కసి రేగే డైలాగులు, రక్తాలు కారే పోరాటాలు ట్రైలర్ ని అలంకరించాయి. ‘నాపైన పందేలు వేస్తే గెలుస్తరు, నాతోటి పందేలేస్తే చస్తరు. గద్దల కొండ గణేష్ అంటే గజ గజ గజ వణకాలి’ అంటూ తెలంగాణా డైలాగులతో చెలరేగిపోయాడు వరుణ్. తనని ఇలాటి రఫ్ నెగెటివ్ గెటప్ లో రాక్షసంగా చూడడం ఇదే తొలిసారి. ఈ గెటప్ లో తేలిపోకుండా తన పవరేంటో విజృంభించి ప్రదర్శించాడు. ‘ఏంరో, మనం బతుకున్నమని పదిమందికి తెల్వకపోతే, మనం బతుకుడెందుకురా?’ అని మెత్త మెత్తగానూ ప్రశ్నిస్తున్నాడు.
కథేమిటో కూడా ఈ ట్రైలర్ లో చెప్పేశారు – ఫామ్ హౌస్‌లో వున్న డాన్ ని కాదు, ఫామ్‌లో వున్న డాన్‌ని పట్టుకునే కథే ఈ వాల్మీకి అంటూ…ఓ మంచి సినిమా తీయాలనుకునే యువ దర్శకుడు ‘వాల్మీకి’ ని ఎలా చూపించాడన్నదే ఈ సినిమా నేపథ్యమంటున్నారు. కరుడుగట్టిన డాన్ నుంచీ సినీ రచయితగా మారిన మనిషి పాత్ర వరుణ్ తేజ్ ది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో పీరియడ్ లుక్ తో దృశ్యాలు కూడా వున్నాయి – ‘గవాస్కర్ సిక్స్ కొట్టుడు, బప్పీ లహరి పాట కొట్టుడు, నేను బొక్కలు ఇరగ్గొట్టుడు సేమ్ టు సేమ్’ అని పూజా హెగ్డే తో లవ్ ట్రాక్ వుంది.
తమిళ ‘జిగర్తాండా’ ని హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. కొంత గ్యాప్ తర్వత హరీష్ చేస్తున్న మూవీ ఇది. ఛోటా కె ప్రసాద్ ఛాయాగ్రహణం, మిక్కే జె మేయర్ సంగీతం నిర్వహిస్తున్న ఈ మాస్ యాఆక్షన్ లో పూజ హెగ్డే తో బాటు అథర్వ మురళి, మృణాళిని, రవి నటిస్తున్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.