ఎక్క‌డ వ‌దిలేశానో అక్క‌డే ఆగిపోయాను!

శ‌ర్వానంద్, స‌మంత తొలిసారి జంట‌గా న‌టిస్తున్న చిత్రం `జాను`. త‌మిళ ద‌ర్శ‌కుడు `96` ఫేమ్‌ ప్రేమ్‌కుమార్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించిన చిత్రం `96` త‌మిళంలో మంచి విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా త్రిష‌కు ఏకంగా 11 అవార్డుల్ని తెచ్చిపెట్టింది. ఆ చిత్రాన్నేతెలుగులో `జాను` పేరుతో రీమేక్ చేస్తున్నారు.

త‌మిళంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న ఈ చిత్రం తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో రీమేక్ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ ఫ‌స్ట్ లుక్ ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. గురువారం టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. శ‌ర్వా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్ ప్రేమికుల్ని అమితంగా ఆక‌ట్టుకునేలా క‌నిపిస్తోంది. ప్రేమికుల మ‌ధ్య సాగే క‌ళ్ల సైగ‌ల్లో కోటి భావాలు క‌నిపిస్తుంటాయి. ఈ టీజ‌ర్‌లోని హీరో హీరోయిన్‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల్లోనూ అవే భావాలు తొనికిస‌లాడుతున్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు హృద్యంగా భావోద్వేగ‌భ‌రితంగా సాగుతాయ‌నిపిస్తోంది.

స‌మంత `చాలా దూరం వెళ్లిపోయావా రామ్‌…అని అడిగితే.. నిన్ని ఎక్క‌డ వ‌దిలేశానో అక్క‌డే ఆగిపోయాన‌ని శ‌ర్వానంద్ చెబుతున్న డైలాగ్‌లు సినిమాలో ఇద్ద‌రి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ ఎంత హృద్యంగా వుంటుందో అర్థ‌మ‌వుతోంది. గోవింద్ వ‌సంత్ అందించిన నేప‌థ్య సంగీతం త‌మిళంలో ఇప్ప‌టికీ ప్రేమికుల్ని హంట్ చేస్తూనే వుంది. అదే ఫీల్‌ని అందించేలా గోవింద్ మ‌రో బీజీఎమ్‌ని ఈ రీమేక్‌కి అందించాడు. గుండెలోతుల్లోకి దూరి పాత జ్ఞాప‌కాల్ని త‌ట్టి లేపుతున్న‌ట్టుగా నేప‌థ్య సంగీంతం వుంది. అందుకే ఈ చిత్రాన్ని ప్రేమికుల నెల అయిన ఫిబ్ర‌వ‌రి 7న రిలీజ్ చేస్తున్నారు.