కరోనా టాలీవుడ్ ఇండస్ట్రీకి చుక్కలు చూపిస్తోంది. సినీ కార్మికుల దగ్గరి నుంచి డిస్ట్రిబ్యూర్స్, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, థియేటర్ సిబ్బంది చాలా సఫరవుతున్నారు. సినిమా రిలీజ్‌లన్నీ ఆగిపోయాయి. ఎప్పుడు కరోనా క్లియర్ అవుతుందో తెలియదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించిన అంశాలని బట్టి చూస్తే ఇప్పట్లో కరోనా ప్రభావం మానవాళిని విడిచిపెట్టేలా కనిపించడం లేదు.
లాక్డౌన్ ఎత్తేసినా ఈ పరిస్థితుల్లో థియటర్లు ఓపెన్ చేయడం కష్టమే అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు. ఇదిలా వుంటే రోజుకో సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోందంటూ వరుస కథనాలు వినిపిస్తున్నాయి. ముందు రాజ్ తరుణ్ నటించి ఒరేయ్ బుజ్జిగా`, ఆ తరువాత రామ్ నటిస్తున్న `రెడ్`, అనుష్క నటించిన `నిశ్శబ్దం` చిత్రాల్ని డైరెక్ట్‌గా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. నిర్మితలు అలా రిలీజ్ చేయడం లేదు మొర్రో అన్నా వరుస కథనాలు మాత్రం ఆగడం లేదు.
తాజాగా నాని, సుధీర్‌బాబు హీరోలుగా నటించిన `వి` సినిమా కూడా డిజిటల్లోనే రిలీజ్ అవుతోందని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో సినిమాల్ని విడుదల చేస్తామంటే ఏ హీరో, హీరోయిన్ అడ్డు చెప్పడం లేదు. అభ్యతరం తెలిపడం లేదు. అయితే అలా రిలీజ్ చేస్తే పెట్టిన పెట్టుబడి వస్తుందా? లేక అంతకు మించి వస్తుందా అనే విషయంలో మా నిర్మాతలకు స్పష్టతలేదు. కొన్ని రోజులు వేచి చూసి తరువాత రిలీజ్‌లపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాం` అని దిల్ రాజు సన్నిహితుల వద్ద తెలిపినట్టు తెలిసింది.