సూప‌ర్‌స్టార్- స్టైలిష్‌స్టార్ ఫ్యాన్స్‌కి పండ‌గే!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి నువ్వా- నేనా అనే రేంజ్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌బోతున్న విష‌యం తెలిసిందే. మ‌ధ్య‌లో ర‌జ‌నీ `ద‌ర్బార్‌`, ఆ త‌రువాత క‌ల్యాణ్‌రామ్ `ఎంత మంచి వాడ‌వురా!` బ‌రిలో నిలిచినా పోటీ మాత్రం ప్ర‌ధానంగా మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`, అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుకర‌ములో` చిత్రాల‌ మ‌ధ్య‌నే సాగ‌బోతోంది. సంక్రాంతి రేస్ `ద‌ర్బార్‌`తో మొద‌లైపోయింది. ఇక పందెం కోళ్ల రాకే మిగిలి వుంది. 11న `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో మహేష్ బ‌రిలోకి దిగుతున్నారు. ఒక్క రోజు తేడాతో 12న అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో`తో రంకెయ్య‌బోతున్నాడు.

`స‌రిలేరు నీకెవ్వ‌రు` ఫుల్ ఆఫ్ ఫ‌న్‌, దేశ భ‌క్తి, మ‌ద‌ర్ సెంటిమెంట్‌ని న‌మ్ముకుంటే `అల వైకుంఠ‌పుర‌ములో` టీమ్ ఇప్ప‌టికే సంగీతంతో స‌గం పోటీని గెలిచేసింది. బ్యాలెన్స్‌గా వున్న స‌గాన్ని కంటెంట్‌తో అధిగ‌మించ‌నుంద‌ని స్వ‌యంగా ఈ చిత్ర నైజామ్ డిస్ట్రిబ్యూట‌ర్ దిల్‌రాజు ఓపెన్‌గా చెప్పేశారు. దీంతో మ‌హేష్‌, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అప్పుడే పండ‌గ చేసుకోవ‌డం మొద‌లుపెట్టారు. మంచి జోష్‌లో వున్న వారికి ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు మ‌రో గుడ్ న్యూస్‌ని చెప్పేశాయి.

`స‌రిలేరు నీకెవ్వ‌రు`, `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమాల్ని ఈ నెల 17 వ‌ర‌కు అర్థ‌రాత్రి 1 గంట నుంచి మార్నింగ్ 10 గంట‌ల వ‌ర‌కు టూ స్పెష‌ల్ షోస్ ప్ర‌ద‌ర్శించుకునేలా అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇటు తెలంగాణ‌లో ఈ రెండు చిత్రాలతో సంబంధం వున్నదిల్‌రాజుకు మార్నింగ్ 7 గంట‌ల షోల‌ని ప్ర‌ద‌ర్శించుకునే అవ‌కాశాన్ని ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఇది సూప‌ర్‌స్టార్- స్టైలిష్‌స్టార్ ఫ్యాన్స్‌కి నిజంగా పండ‌గే!.