రాజ్ తరుణ్‌కు నోటీసులు జారీ,అరెస్ట్ చేస్తారా?

రాజ్ తరుణ్‌కు పోలీసులు నోటీసు జారీ 

చూస్తూంటే రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసులో పూర్తిగా కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్న చందంగా రాజ్ తరుణ్ యాక్సిడెంట్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లటం లేనిపోని కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. తాజాగా రాజ్ తరుణ్‌కు సీఆర్పీసీ 41 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాటిని రాజ్ తరుణ్‌కు అందజేసి.. ఆయన స్టేట్‌మెంట్‌ను నార్సింగి పోలీసులు రికార్డ్ చేశారు. రెండు రోజుల్లో పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్‌ను దాఖలు చేయనున్నారు. యాక్సిడెంట్ కేసులో రాజ్ తరుణ్ పై 279, 336 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజ్ తరుణ్ నుంచి పూర్తి వివరాలను నార్సింగి పోలీసులు సేకరించారు. డ్రంకెన్ డ్రైవ్ చేశాడన్న దానికి సరైన ఆధారాలు లేవన్నారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేసి ఉంటే తెలిసిపోయేదని.. కానీ.. కారు ఎవరు నడుపుతున్నరో తెలుసుకోవడానికే ఒకరోజు పట్టిందన్నారు. డ్రంకెన్‌డ్రైవ్ చేయలేదని తమకు ఇచ్చిన స్టేట్ మెంట్‌లో రాజ్ తరుణ్ చెప్పాడన్నారు.

ఇదిలా ఉంటే…రాజ్ తరుణ్ యాక్సిడెంట్ ను కార్తీక్ అనే వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో ద్వారా డబ్బు కోసం తమను బ్లాక్ మెయిల్ చేశాడని కార్తీక్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర ఫిర్యాదు చేశారు. యాక్సిడెంట్‌ వీడియోలు మీడియాకు ఇస్తానని డిజైనర్‌ కార్తీక్‌ బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడినట్టు రాజా రవీంద్ర గురువారం(ఆగస్టు 22,2019) పోలీసులతో చెప్పారు.