బ్రేకింగ్‌: ఓయూ స్టూడెంట్‌లీడ‌ర్‌గా ప‌వ‌ర్‌స్టార్!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల క్రితం చేసిన `అజ్ఞాత‌వాసి` మెగా ఫ్యాన్స్‌కి నిరాశ‌ను మిగిల్చింది. ఈ సినిమా త‌రువాత ప‌వ‌న్ ఇక సినిమాలు చేసే అవ‌కాశం లేద‌ని, కంప్లీట్‌గా రాజ‌కీయాల‌కి ప‌రిమితం అయిపోతారని ప్ర‌చారం జ‌రిగింది. ప‌వ‌న్ కూడా నేనా మ‌ళ్లీ సినిమాల్లోకా… అన్న‌ట్టు త‌న‌ని సినిమా చేయమ‌న్న ప్ర‌తీవారితో అనంటూ వ‌చ్చారు. కానీ సీన్ మారింది. అడ్వాన్స్‌లు ఇచ్చిన వాళ్ల ద‌గ్గ‌రి నుంచి ఒత్తిడి మొద‌లైంది. దీంతో మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌క త‌ప్ప‌లేదు.

`పింక్‌` రీమేక్‌తో వ‌రుస సినిమాల్ని లైన్‌లో పెట్టాడు. శ్రీ‌రామ్ వేణు నుంచి త్రివిక్ర‌మ్, బాబీ, కిషోర్ పార్థ‌సాని వ‌ర‌కు వ‌రుస‌గా ఐదు చిత్రాల్ని అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. ఈ వ‌రుస‌లో ముందు మొద‌లైన సినిమా `పింక్‌` రీమేక్. బోనీక‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ఇది. హిందీ `పింక్‌`, త‌మిళంలో రీమేక్ చేసిన `నేర్కొండ‌పార్వై`ల‌కు పూర్తి భిన్నంగా కొత్త త‌ర‌హాలో ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారు. హిందీ నుంచి త‌మిళ్‌కు వెళ్లేస‌రికి హీరో అజిత్ కోసం ఫైట్స్‌, విద్యాబాల‌న్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ని జోడించి కొత్త క‌ల‌రింగ్ ఇచ్చారు. తెలుగుకు వ‌చ్చే స‌రికి కంప్లీట్‌గా ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టుగా క‌థ‌లో చాలా మార్పులు చేశారు.

త‌మిళంలో అజిత్‌కు ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని జోడిస్తే ఇక్క‌డ ప‌వ‌న్ యంగ్ ఏజ్‌ని, కాలేజ్ డేస్‌ని, అక్క‌డ అత‌ను ల‌వ్‌లో ప‌డే స‌న్నివేశాల‌ని చూపించ‌బోతున్నారు. జార్జిరెడ్డి త‌ర‌హాలో ఓయూ స్టూడెంట్ లీడ‌ర్‌గా ప‌వ‌న్ క‌నిపించ‌బోతున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు అన్నీ పూర్త‌య్యాయి. మూడ‌వ షెడ్యూల్‌లో ప‌వ‌న్ ఎంట‌ర్ అవుతారు. అందుకే గ‌డ్డం తీసేసి క్లిన్ షేవ్‌తో క‌నిపిస్తున్నారు. `తీన్‌మార్‌` త‌ర‌హాలో వింటేజ్ లుక్ వుంటుంది కాబ‌ట్టి ప‌వ‌న్ క్రాఫ్‌లో ఎలాంటి మార్పులు చేయ‌డం లేదు. ఈ ఏపిసోడ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు.