ప‌వ‌న్‌కు పారితోషికం కాదు వాటానే!

స్టార్ హీరోలు ఈ మ‌ధ్య కొత్త ఎత్తుగ‌డ వేస్తున్నారు. పారితోషికం కంటే వాటాకే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. అలా అయితే అధిక మొత్తం దండుకోవ‌చ్చ‌న్న స్టార్‌ల కొత్త ఎత్తుగ‌డ‌గా క‌నిపిస్తోంది. `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రానికి మ‌హేష్ పారితోషికం తీసుకోలేదు. ఈ సినిమా భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తున్న విష‌యం తెలిసిందే. ముందు చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం మ‌హేష్ పారితోషికం 50 కోట్ల‌ని తెలిసింది. తాజాగా ఇదే పంథాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనుస‌రిస్తున్నారు.

కొంత విరామం త‌రువాత ప‌వ‌న్ మ‌ళ్లీ `పింక్‌` రీమేక్‌తో కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్ రాజుతో క‌లిసి బోనీక‌పూర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. కేవ‌లం 20 నుంచి 30 రోజులు మాత్ర‌మే ప‌వ‌న్ ఈ చిత్రానికి కేటాయించార‌ట‌. అయితే ఈ సినిమాకు ప‌వ‌న్ పారితోషికం తీసుకోవ‌డం లేద‌ని తెలిసింది. ఆ స్థానంలో వాటా తీసుకుంటున్నార‌ట‌. నిర్మాత‌ల‌తో ఈ విష‌యంలో ఒప్పందం కూడా జ‌రిగింద‌ని, వాటా కింద ప‌వ‌న్‌కు దాదాపు 50 కోట్లు చేతికి వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్లో వినిపిస్తోంది.

ఇప్ప‌టికే హిందీ, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో మాత్రం పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని క‌మ‌ర్షియ‌ల్ ఎలామెంట్స్‌ని జోడించి మ‌రింత స్టైలిష్‌గా ఈ చిత్రాన్ని శ్రీ‌రామ్ వేణు తెర‌పైకి తీసుకొస్తున్నార‌ట‌. హిందీతో పోలిస్తే త‌మిళ వెర్ష‌న్‌ని అజిత్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టుగా మార్చారు. త‌మ‌ళ్ వెర్ష‌న్‌ని మ‌రితంగా మార్చి దానికి ప‌వ‌న్ ఇమేజ్‌ని జోడించార‌ట‌.