`పునాదిరాళ్లు` ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ మృతి!

`పునాదిరాళ్లు` చిత్రంతో మెగాస్టార్ చిరంజీవిని న‌టుడిగా ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ శ‌నివారం ఉద‌యం మృతి చెందారు. తొలి చిత్రంతోనే ఐదు నంది అవార్డుల్ని సొంతం చేసుకుని ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నారు. క‌న్నతండ్రి ఆగ‌డాల‌కు కొంత మందితో క‌లిసి బుద్దిచెప్పే ఓ కొడుకు క‌థ‌గా ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ మ‌లిచిన తీరు ప్రేక్ష‌కుల్ని, విమర్శ‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. దీంతో తొలి సినిమాతోనే ఆయ‌న‌ను అవార్డులు వ‌రించాయి.

గ‌త కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు రాజ్‌కుమార్. ఈ విష‌యం తెలిసిన చిరంజీవి అపోలో ఆసుప‌త్రిలో చేర్పించి వైద్య ప‌రీక్ష‌లు చేయించార‌ట‌. ఆ త‌రువాత కూడా అనారోగ్యం పాలు కావ‌డంతో శ‌నివారం రాజ్‌కుమారు మృతి చెందారు. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు గ‌త కొన్నేళ్లుగా ఎలాంటి ప‌ని దొర‌క‌డం లేదు. దీంతో ఆయ‌న పెద్ద‌కుమారుడి వ‌ద్దే వుంటున్నారు. ఆ మ‌ధ్య పెద్ద‌కుమారుడు, భార్య‌ కూడా మ‌ర‌ణించ‌డంతో రాజ్‌కుమార్ జీవితం ఇబ్బందిక‌రంగా మారింది. ఆయ‌న స్వ‌గ్రామం విజ‌య‌వాడ స‌మీపంలోని ఉయ్యూరు. ఆయ‌న అంత్ర‌క్రియ‌లు అక్క‌డే జ‌ర‌నున్నాయి. ఇందు కోసం చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు.