వెండితెరపై గంభీరంగా కనిపించే హీరోలు ఏడుస్తుంటే, భావోద్వేగానికి లోనవుతుంటే చూడటానికి ఏ ప్రేక్షకుడు ఇష్టపడరు. ఒక వేళ హీరో ఏడుస్తున్నా, భావోద్వేగానికి లోనవుతున్నా సగటు ప్రేక్షకుడు తట్టుకోలేడు. తనతో కలిసి ఏడ్చేస్తాడు. అదీ అభిమానం అంటే. అయితే వెండితెరపై విలన్లని ఒంటి చేత్తో మట్టి కరిపించే హీరో నిజజీవితంలో ఏడవడం, భావోద్వేగానికి గురికావడం వంటి దృశ్యాల్ని చూస్తే షాక్ అవుతుంటాం. అలాంటి షాక్‌కు గురిచేసే సంఘటనే ఇటీవల చెన్నైలో చోటు చేసుకుంది. ఓ సమావేశంలో పాల్గొన్నహీరో సూర్య దుఃఖం ఆపుకోలేక చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడయాలో వైరల్‌గా మారాయి.
సినిమాల్లో కోట్లు సంపాదించి స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు అంతా మెట్రో నగరాల్లో మల్టీప్లెక్స్‌లు, విలువైన భూములు, ఫామ్ హౌజ్‌లు, రెస్టారెంట్లు కట్టేస్తుంటే కొంత మంది మాత్రం పది మందికి సేవచేయడానికి ఆ డబ్బును ఖర్చు చేస్తూ ఆపన్నులకు అండగా వుంటున్నారు. అలాంటి వాళ్లలో ముందు వరుసలో నిలిచిన హీరో సూర్య. గత ఐదేళ్లుగా చెన్నైలో అగరం ఫౌండేషన్ పేరుతో తమ కుటుంబం తరుపున ఓ ఆర్గనైజేషన్‌ని నడిపిస్తున్నారు. దీని ద్వారా చెన్నై చుట్టుపక్కల గ్రామాల్లో పేదరికం కారణంగా విద్యకు దూరమవుతున్న వారిని చదవిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు.
ఇదే ట్రస్ట్‌లో ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ పట్టా పొందింది తంజావూరుకు చెందిన ఒక మువతి. క్యాంపస్‌లో ప్లేస్‌మెంట్‌ని సాధించింది. తన తండ్రి క్యాన్సర్‌తో చనిపోతే తల్లి డైలీ కూలీగా పని చేస్తూ తనని చదివించిందని, ఆమె కష్టం చూడలేక మధ్యలోనే చదువు ఆపేయాలనుకున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ మాటలు విన్న సూర్య దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. స్టేజ్‌పై నుంచి కిందికి దిగుతూ ఏడుస్తూనే ఆ యువతి దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా హత్తుకుని బోరున ఏడ్వడం అక్కడున్నవారిని కలిచివేసింది.