ఎంటర్టైన్మెంట్ విభాగంలో దూసుకుపోతున్న భారతీయ మార్కెట్లోకి అమెజాన్ ప్రైమ్, కొత్తగా నెట్‌ఫ్లిక్స్ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డిజిటల్ విభాగంలో కొంత వరకు భారతీయ మార్కెట్‌ని అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఆక్రమించేశాయి కూడా. ఇక బాలీవుడ్‌కు చెందిన ఆల్ట్ బాలాజీ, జీ 5, ఎమ్ ఎక్స్ ప్లేయర్, ఈరోస్ నౌ వంటి దిగ్గజ సంస్థలు డిజిటల్ మార్కెట్లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌ల తో పోటీపడుతున్నాయి.
టాలీవుడ్‌ని ఇప్పటికే కొంత మేర అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఆక్రమించేసింది. ఇలా ఊరుకుంటే లాభం లేదని రంగంలోకి దిగిన నిర్మాత అల్లు అరవింద్ సొంతంగా `అహా` పేరుతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని ప్రారంభించారు. దీనికి వెన్నుదన్నుగా మైహోమ్ రామేశ్వరరావు అండగా నిలబడటంతో ముందు మాత్రం అల్లు అరవింద్ చక్రం తిప్పేస్తూ పాత సినిమాలు, రెండు నెలల క్రితం రిలీజైన సినిమాలతో అహా యాప్‌ని నింపేశారు. అయితే ఇందులో దిల్ రాజు కూడా ఓ పార్ట్నర్గా వుండాలనుకున్నారు.
ఏమైందో ఏమో తెలియదు కానీ దిల్ రాజు `అహా` నుంచి బయటికి వచ్చేశాడు. పదేళ్లుగా సినిమాలు నిర్మిస్తూ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా వున్న తనే ఎందుకు సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని స్టార్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నారట దిల్ రాజు. త్వరలోనే ఓ కొత్త యాప్‌ని రంగంలోకి దించబోతున్నారట. దానికి ఎస్వీసీ అని నామకరణం చేస్తారో లేక అల్లు అరవింద్‌లా తను కూడా తన మనవరాలి పేరునో, మనవడి పేరునో పెట్టుకుంటారో చూడాలి.