కరోనా (కొవిడ్-19) దెబ్బకి టాలీవుడ్ కి భారీ నష్టాలు షురూ అయినట్టే. షూటింగ్ లు బంద్ అయ్యాయి. థియేటర్లు మూతపడ్డాయి. ఎక్కడ పెట్టిన పెట్టుబడులు అక్కడే ఎటూ కాకుండా అయిపోయాయి. అన్ని పరిశ్రమలపై పడినట్టే వినోద పరిశ్రమపైనా బిగ్ పంచ్ పడిందన్న విశ్లేషణ సాగుతోంది. హాలీవుడ్ టు టాలీవుడ్ ఇప్పుడు ఇదే సీన్. ముఖ్యంగా సినిమా కోసం భారీ పెట్టుబడుల్ని వెదజల్లే నిర్మాతలకు పెద్ద మొత్తంలో నష్టాలు తప్పేట్టు లేదు. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు… ఎగ్జిబిటర్లు….బయ్యర్లను కొవిడ్-19 కోలుకోలేని దెబ్బ కొట్టిందని టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా వైరస్ ఆ నలుగురిపై మాత్రం పంజా విసిరిందనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మొత్తం ఆ నలుగురి చేతిలో ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. వాళ్ల సినిమాల్నే వీటిలో ఆడిస్తారు. అలాగే ఎవరైనా రిలీజ్ చేయాలన్నా వీళ్లనే సంప్రదించాలి. లేదా తక్కువకు కట్టబెట్టాలి ఏదైనా.
ఆ క్రమంలోనే ఆ నలుగురికి చిన్న నిర్మాతలు కొత్త నిర్మాతలకు మధ్య ఎప్పుడూ ఏదో ఒక యుద్ధం జరిగేది.
థియేటర్ల సిండికేట్ విధానం తొలగిపోవాలని చిన్న సినిమా నిర్మాతలు ఎన్నో ఉద్యమాలు చేసారు. ఫిలిం ఛాంబర్ ముందు టెంట్లు వేసి ఎన్నోసార్లు లబోదిబో మన్నారు. కమ్యునిస్ట్ పార్టీలు సైతం చిన్న నిర్మాతలకు అండగా ఆ నలుగురు లేదా ఆ పదిమంది సినీపెద్దలు నిలబడాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాయి. దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు.. వెటరన్ దర్శకనటుడు నారాయణ మూర్తి లాంటి వారు ఎంతో ఆవేదన వ్యక్తం చేసేవారు. అయినా లాభం లేకపోయేది. ఆ అరుపులు..ఆందోళను…ఆర్తనాదాలు కేవలం మీడియా వరకే పరిమితం అయ్యేవి. యథేచ్చగా ఆ నలుగురు తమ పని తాము చేసుకుంటూ తమ ఖజానా మాత్రం నింపుకునేవారు. కానీ కరోనా దెబ్బకి ఇప్పుడు ఎవరికీ సౌండ్ లేదు. నా ముందు అందరూ సమానమేనని కరోనా చాటి చెప్పింది. వైరస్ కి మహమ్మారీకి పేద.. ధనిక అనే తేడాలేవీ ఉండవు. రాజ్యాధిపతుల్నే వదిలి పెట్టలేదు.
కరోనా అందరినీ చుట్టబేట్టేస్తుందని హెచ్చరించడంతో ఆ నలుగురు సైతం ఇప్పుడు అన్ని బిజినెస్ లు షట్ డౌన్ చేసి సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు నలుగురిపై ఆరోపించే వాళ్లే లేరు. కనీసం చిన్న నిర్మాతల ఆకలికేకలు బాధలు సైతం వినిపించే పరిస్థితి లేదు. కరోనా అటూ ఇటూ అన్ని వర్గాలకు పాఠాలు నేర్పించింది. ఆ నలుగురికి ఉన్న నాలుగు మార్గాల్ని మూసేసింది కరోనా. సినీ నిర్మాణం.. థియేటర్ ఎగ్జిబిషన్.. పంపిణీ.. స్టూడియోల నిర్వాహణ అన్నీ గప్ చుప్. ఒక సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయలేకపోతే ఎంత నష్టం వస్తుంది? ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి? ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి? సమాజంలో మంచి.. చెడు.. ఇవన్నీ వాళ్లకి కూడా బాగా అర్ధమవుతోందని కొందరు చిన్న నిర్మాతలు గుసగుసలాడడం ఫిలింనగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. థియేటర్లు ఇవ్వండి మహాప్రభో! అని మొర పెట్టుకుంటే.. మా సినిమా రిలీజ్ కి వస్తోంది ఇవ్వలేం అని చెప్పలేని పరిస్థితి ఉందిప్పుడు. చోటా మోటా నిర్మాతలు నెత్తి నోరు బాదుకున్నా థియేటర్లను విదిలించేందుకు ఎవరూ సిద్ధంగా ఉండే వారు కాదు. రకరకాల రాజకీయాలు నడిచేవి. ఇప్పుడు మాతో పాటు మీరూ ఏడవండి… మీరు మేము సమానమే! ఇది దేవుడి ఆజ్ఞ!! అంటూ కొందరు ఆ నలుగురి వ్యతిరేకులు ఆయాచితంగా మానసిక ఆనందాన్ని పొందుతున్నారట!! ఇక ఎలాగూ చిన్న సినిమాల రిలీజ్ లు ఎప్పుడూ సవ్యంగా జరగవు కాబట్టి తమకు వచ్చే నష్టాలపై కలత చెందడం లేదట.
చూసారా? చైనా- వూహాన్ లో పుట్టిన వైరస్ టాలీవుడ్ లో ఎంత మందికి ఎన్ని పాఠాలు నేర్పిందో? స్వార్థాన్ని దుర్మార్గాన్ని ఆడుకోవడం కూడా కరోనా లక్షణం అని బయటపడింది. ఇక కరోనా రెగ్యులర్ గా మనుషులను చప్పరిస్తూ ఆటాడుకుంటోంది. అది దాని టార్గెట్ రీచ్ అయ్యే వరకూ పంజా విసుతూనే ఉంటుంది. ఎదురు దాడికి దిగిన మానవాళికి పాఠాలు చెబుతూ ముందుకు సాగుతోంది. అయితే ఒక వైరస్ పై యుద్ధంలో మానవుడు గెలుస్తాడా లేదా? అన్నది ఇప్పుడే తేలని గందరగోళంలా మారింది.