కొవిడ్-19 ఎఫెక్ట్ టాలీవుడ్ పై స్ఫష్టంగా కనిపిస్తోంది. లాక్ డౌన్ తో థియేటర్లు బంద్ అయ్యాయి. ఎక్కడి షూటింగ్ లు అక్కడే నిలిచిపోయాయి. దీంతో నిర్మాతలకు కోట్లలో నష్టం తప్పదని అంచనా. బ్యాంక్ రుణాలపై వడ్డీ భారం… ఫైనాన్షియర్ల నుంచి ఒత్తిళ్లు తప్పవు. ఇదేగాక మునుముందు ఈ సమస్యకు పరిష్కారం ఎప్పటికి అన్నది విశ్లేషించినా టాలీవుడ్ కి కరోనా వైరస్ కోలుకోలని దెబ్బ పడిపోయింది. మే 3 తో లాక్ డౌన్ ముగిసినా…థియేటర్లు రీ ఓపెన్ అవుతాయా లేదా? అన్నది ఇప్పటికే సస్పెన్స్ గా మారింది. తెలంగాణలో అయితే మే నెలాఖరు వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని కేసీఆర్ ఇప్పటికే హింట్ ఇచ్చేశారు. దీంతో అక్కడ ఇంకో నెల సినిమా రిలీజ్ లకు.. షూటింగులకు గండమే. కొవిడ్ -19 కి వ్యాక్సిన్ లేని నేపథ్యంలో థియేటర్లతో పెను ప్రమాదమే పొంచి ఉందని టాలీవుడ్ లో ఓ అగ్ర నిర్మాతే బాహాటంగా వెల్లడించడంతో టెన్షన్ ఇంకాస్త అదనంగా రాజుకుంది.
ఇలాంటి సమయంలో థియేటర్లు ఓపెన్ చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని…ఆరు నెలల నుంచి ఏడాదిపాటైనా థియేటర్లు మూత పడే ఛాన్స్ ఉందని…దానికి సంబంధించి నిర్మాతల సంఘంతో చర్చలు జరుగుతున్నాయని కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ పైనా నీలి నీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. తాజా పరిస్థితులు విశ్లేషించి చూస్తే ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని జనవరి 8 న రిలీజ్ చేయగలమా? లేదా? అంటే దర్శకుడు రాజమౌళినే నో ఐడియా అనేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ జనవరి లో దాదాపు ఉండే అవకాశం లేదు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను…మార్కెట్ పై రాజమౌళికి ఉన్న గ్రిప్ దృష్ట్యా ఆయన అలా మాట్లాడి ఉండొచ్చనవి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసేసినా రిలీజ్ చేయడమెలా అన్నది సమస్యనే. తాజా పరిస్థితులే ఆయన్ని ఆందోళనకు గురి చేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది. కేవలం దర్శకధీరుడి సమస్యేనా అంటే.. ఇక మిగతా సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. హీరోలంతా పారితోషికం తగ్గించుకుని పనిచేయాలని ఇప్పటికే నిర్మాతల నుంచి డిమాండ్ మొదలైంది. నిర్మాతల సంఘంతో… స్టార్ హీరోలందరితో సమావేశమై సుధీర్గంగా చర్చిస్తే తప్ప తాజా పరిస్థితులకు ఓ పరిష్కారం దొరకదని అంతా భావిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..
