కమల్‌హాసన్ నటిస్తున్న `ఇండియన్ 2` కథ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతున్నసమయంలో హఠాత్తుగా క్రేన్ విరిగిపడటంతో ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ప్రమాదం తరువాత కమల్ హాసన్ లైకా పై విరుచుకుపడుతూ ఘాటుగా ఓ లేఖని కూడా రాశారు.
దీంతో ఇద్దరి మధ్య కొత్త వివాదం మొదలైంది. కమల్ లేఖపై లైకా ఘాటుగా స్పందించి జరిగింది చాలు ఇక షూటింగ్‌ని మొదలు పెట్టండి అంటూ వివాదాన్ని మరింత జఠిలం చేశారు. ఆ తరువాత అంతా సద్దుమనిగింది అనుకుంటున్న తరుణంలో చెన్నై పోలీసులు కేసు విచారణ పేరుతో కమల్‌హాసన్‌ని, దర్శకుడు శంకర్‌ని పదే పదే విచారించడం సరికొత్త వివాదానికి తెరలేపింది. పోలీస్ విచారణపై సీరియస్ అయిన కమల్ చెన్నై హైకోర్టుని ఆశ్రయించడం సంచలనం సృష్టిస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే చెన్నై పోలీసులు లైకా అధినేత సుభాస్కరన్‌తో పాటు హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్, క్రేన్ ఆపరేటర్‌పై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణ పేరుతో ఇటీవల వీరిని వాయిదాల ప్రకారం విచారిస్తున్నారట. ఈ విచారణపై ఆగ్రహించిన కమల్ హైకోర్టుని ఆశ్రియించారట. కమల్ పిటీషన్ని స్వీకరించిన న్యాయస్థానం ఎలాంటి తీర్పుని వెల్లడిస్తోందోని సర్వత్రా ఆసక్తినెలకొన్నట్టు తెలిసింది.