`ఆహా` కోసం బ‌న్నీని కూడా దించేస్తున్నారు!

డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ ఇప్పుడు సినిమాని శాసిస్తోంది. దీంతో స్టార్స్ చాలా వ‌ర‌కు వెబ్ సిరీస్‌ల బాట ప‌డుతున్నారు. బాలీవుడ్‌లో ఇప్ప‌టికే సైఫ్ అలీఖాన్‌, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, మ‌నోజ్ బాజ్‌పాయ్ వంటి వాళ్లు వెబ్ సిరీస్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించి స‌క్సెస్ ఫుల్‌గా కెరీర్‌ని కొన‌సాగిస్తున్నారు. తెలుగులో కూడా ఈ సంప్ర‌దాయం ఇప్పుడిప్పుడే స్టార్ట‌వుతోంది. ఇదిలా వుంటే తెలుగులో మొట్ట‌మొద‌టి డిజిటల్ ఓటీటీని ఇటీవ‌లే అల్లు అర‌వింద్ మొద‌లుపెట్టారు.

అయితే దీనికి అనుకున్న స్థాయిలో ఆద‌ర‌ణ ద‌క్క‌డం లేద‌ని తెలుస్తోంది. దీంతో అల్లు అర‌వింద్ బిగ్ డైరెక్ట‌ర్‌ల‌ని రంగంలోకి దింపేస్తున్నారు. మైహోమ్ గ్రూప్ అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు వ‌న్ ఆఫ్ ది భాగస్వామిగా వ్యవ‌హ‌రిస్తుండ‌టంతో రెమ్యున‌రేష‌న్‌ల బాధ‌లేదు కాబ‌ట్టి సుకుమార్‌, వేణు ఊడుగుల‌, సుధీర్‌వ‌ర్మ‌ల‌ని రంగంలోకి దించేస్తున్నారు. ఊహించిన స్థాయికి మించి ఓటీటీ రీచ్ కావాలంటే అల్లు అర్జున్ అవ‌స‌రం అని భావించిన అల్లు అర‌వింద్ బ‌న్నీతో ఓ క‌మ‌ర్ష‌య‌ల్ యాడ్‌ని ప్లాన్ చేశార‌ట‌.

దీని చిత్రీక‌ర‌ణ బాధ్య‌త‌ల్ని త్రివిక్ర‌మ్‌కు అప్ప‌గించార‌ట‌. ఈ యాడ్‌లో `రొమాంటిక్‌` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న కేతిక శ‌ర్మ కూడా న‌టించ‌నుంద‌ని తెలిసింది. బుధ‌వారం నుంచి షూటింగ్ జ‌ర‌గ‌నున్న ఈ యాడ్ ఫిల్మ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్ర‌త్యేకంగా ఓ సెట్‌ని కూడా వేశార‌ట‌. బ‌న్నీ ప్ర‌చారం `ఆహా`కు ఏ స్థాయిలో క‌లిసి వ‌స్తుందో చూడాలి.