అల్లు అర్జున్‌కు ఘోర అవ‌మానం!

`అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచి అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు బ‌న్నీ. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచి అల్లు అర్జున్ చిర‌కాల కోరిక‌ను తీర్చేసింది. ఆ సంతోషంలో మీడియా పార్టీలు, ఇండ‌స్ట్రీ పార్టీలు చేసుకుంటూ సంబ‌రాలు జ‌రుపుకున్నారు బ‌న్నీ అండ్ టీమ్‌. అయితే అలాంటి బ‌న్నీకి ఘోర అవ‌మానం జ‌రిగింది. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్టైలిష్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న బ‌న్నీ అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని బీగ్రేడ్ చిత్రాల తార ష‌కీలా ప్ర‌క‌టించ‌డం అల్లు ఫ్యాన్స్‌కి షాకిచ్చింది.

ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ష‌కీలా ప‌లు అంశాల‌పై నిర్మొహ‌మాటంగా మాట్లాడింది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మంచి డ్యాన్స్ అని, మ‌హేష్ త‌న‌కు సోద‌రుడ‌ని, అత‌ని సోద‌రి మంజుల త‌న‌కు మంచి మిత్రురాల‌ని చెప్పిన ష‌కీలా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాపిక్ వ‌చ్చేసరికి త‌నెవ‌రో తెలియ‌ద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు అత‌ని పేరు తాను విన‌లేద‌ని చెప్ప‌డం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు మ‌ల‌యాళంలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న విష‌యం తెలిసిందే. అలాంటి బ‌న్నీ త‌న‌కు తెలియ‌ద‌ని ష‌కీలా ఎందుకు చెప్పింద‌ని ఫ్యాన్స్ ఆమెపై మండిప‌డుతున్నారు.