‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ రివ్యూ & రేటింగ్

తెలుగు చిత్రసీమలో మంచి కథలను, అంతే మంచి పాత్రలను ఎంచుకుంటూ తమ కెరీర్ పై దృష్టి సారించే కథానాయకుల్లో నాగశౌర్య ఒకరు. గతంలో వచ్చిన ఆయన చిత్రాలను పరిశీలిస్తే మనకు ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ థియేటర్లలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలకు ముందు రొమాంటిక్ లవ్ కమ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అని మేకర్స్ బోలెడు కహానీలు చెప్పుకున్నారు. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఈ శుక్రవారం (మార్చి 17, 2023)న ప్రేక్షకులు ముందుకొచ్చింది. మరి ఈ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ : సంజయ్ (నాగశౌర్య), అనుపమ (మాళవికా నాయర్) బీటెక్ స్టూడెంట్స్. సంజయ్ కి అనుపమ సీనియర్. సంజయ్ ని అనుపమ సీనియర్స్ ర్యాగింగ్ నుంచి కాపాడుతుంది. ఫలితంగా వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. అలా మొదలైన వీళ్ల పరిచయం కాస్త బెస్ట్ ఫ్రెండ్స్ గా.. ఆ తర్వాత సహజంగానే ప్రేమికులుగా మారతారనుకోండి. అటు తర్వాత పై చదువులకోసం లండన్ వెళ్ళి లివిన్ రిలేషన్ షిప్ లో కాలం గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అదే సమయంలో పూజ (మేఘా చౌదరి)తో సంజయ్ కి స్నేహం మొదలవుతుంది. ఫలితంగా సంజయ్, అనుపమల మధ్య దూరం మరింత పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లిద్దరి జీవితాల గమ్యం ఎటువైపునకు దారితీసింది? ఇంతకీ పూజ-సంజయ్ ల మధ్య ఏం జరిగింది? చాలా గ్యాప్ తర్వాత సంజయ్ – అనుపమ కలిశారా? లేదా? మధ్యలో గిరి (శ్రీనివాస్ అవసరాల) ఎవరు? అతడి పాత్ర ఏమిటి? అనేది తెలియాలంటే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కోసం థియేటర్లలోకి అడుగు పెట్టాల్సిందే!

విశ్లేషణ: ప్రేమకథను నడుపుతూనే కామెడీని జతచేసి.. కొంచెం ఎమోషనల్ గా మరి కొంచెం వినోదాత్మకంగా చిత్రాన్ని నడపాలని చేసిన ప్రయత్నం మెచ్చుకోతగ్గదే! ఈ విషయంలో దర్శకుడు శ్రీనివాస్ అవసరాలను అభినందించాల్సిందే. అయితే.. ఎటొచ్చీ ..ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ వీక్ గా తయారై ప్రేక్షకుల్ని నిరాశపరిచేలా చేసిందని చెప్పొచ్చు. ఒక అమ్మాయి-అబ్బాయి మధ్య జరిగే జర్నీని దర్శకుడు బాగా ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ.. అది కాస్త బెడిసికొట్టింది. సాగతీత కూడా మరీ ఎక్కువైందనిపించింది. అయితే.. హీరో నాగశౌర్య మాత్రం సినిమాలోని తన క్యారెక్టర్ కు తగ్గట్లు చక్కటి లుక్స్ ని ప్రదర్శిస్తూనే పాత్ర పరంగా, అలాగే నటన పరంగా కూడా తన దైన శైలిలో ఆకట్టుకున్నాడు. అతడికి జోడీగా నటించిన కథానాయిక మాళవిక నాయర్ తన పాత్ర అందర్నీ ఆకట్టుకునే రీతిలో భేషైన నటనను కనబరిచింది. హీరో-హీరోయిన్ మధ్య నడిచే సన్నివేశాల్లో మాళవిక నాయర్ చూపిన నటన వాహ్.. అనిపించింది. లవ్ సన్నివేశాలతో పాటు.. మరికొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. నటనలో తనకుతానే సాటి అనిపించుకుంది. ఇక హీరో హీరోయిన్లకు స్నేహతులుగా నటించిన శ్రీవిద్య,అభిషేక్ మహర్షి కూడా నటనలో తమ పాత్రలకున్న పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు. చిత్రంలోని ఇతర నటీనటుల గురించి చెప్పుకోవడానికేం లేదు. ఆయా పాత్రలన్నీ ఇలా వచ్చి అలా..అలా వెళ్లాయంతే! ఈ చిత్రం కోసం దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తీసుకున్న పాయింట్ కొంతమేర బాగున్నప్పటికీ.. ఆ కథలోని టెంపోని గాలికొదిలేసినట్టనిపించింది. చిత్రంలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మరింత డెప్త్ గా చూపించి వుంటే బాగుండేదనిపించింది. చాలా చోట్ల సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించి సినిమా చూసే ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడు. చిత్రం ప్రథమార్ధంలో లండన్ నేపథ్యంలో జరిగే సన్నివేశాలు కూడా అంతగా ఎవ్వరినీ ఆకట్టుకోవు. దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తన కథలోని కంటెంట్ ను ప్రేక్షకులు మెచ్చేలా స్క్రీన్ మీద పండించలేకపోయాడు. అంతేకాదు.. కథనంలో కూడా ఎన్నో లోపాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.అలాగే లవ్ డ్రామా కూడా అక్కడక్కడా సిల్లీగా అనిపిస్తుంది. అంతెందుకు.. కొన్ని చోట్లా హీరో నాగశౌర్య మధ్య నడిచే సన్నివేశాలు, హీరో ట్రాక్ నత్తనడకన నడిచింది. అలాంటి సన్నివేశాలు కూడా సినిమాకి మైనస్ అయ్యాయి.

టెక్నీకల్ విషయాలకొస్తే… చిత్రంలోని ప్రతీ సన్నివేశం విజువల్ గా ఎంతో అందంగా తెరకెక్కింది. సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ ఎక్కడా మిస్ అవకుండా సాగి సినిమాకే అందాన్ని తెచ్చింది. అలాగే.. కళ్యాణి మాలిక్ సంగీతంలో పాటలన్నీ బాగా కుదిరాయి. ప్రేమ సన్నివేశాల్లో వచ్చే బీజీఎమ్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఎడిటర్ కిరణ్ గంటి తనవంతు పాత్రను నిర్వహించారు. నిర్మాతలు టి.జి. విశ్వ ప్రసాద్-పద్మజ దాసరిలు ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు చిత్ర స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. మొత్తం మీద సాంకేతిక విభాగంలో పని చేసిన వారి పనితీరు మాత్రం తప్పుబట్టలేం.. లోపాలను ఎత్తిచూపలేం. మొత్తం మీద ఈ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రాన్ని మెప్పించని ప్రేమకథగా చెప్పుకోవచ్చు. జస్ట్ ఓకే అంతే!!

(చిత్రం : ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, విడుదల తేదీ : మార్చి 17, 2023, రేటింగ్ : 2.25/5, నటీనటులు: నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య తదితరులు, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల, నిర్మాతలు :టి.జి. విశ్వ ప్రసాద్-పద్మజ దాసరి, సంగీతం:: కళ్యాణి మాలిక్, సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామా, ఎడిటర్: కిరణ్ గంటి).