Miss Shetty Mr. Polishetty Movie Review : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ ఎలావుందంటే

(చిత్రం : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, విడుదల : 7, సెప్టెంబర్ 2023, రేటింగ్ : 3.25/5, నటీనటులు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, అభినవ్ గోమతం, నాసర్, సోనియా దీప్తి, జయసుధ, తులసి, భద్రం తదితరులు. దర్శకత్వం : మహేష్ బాబు పచ్చిగొల్ల, నిర్మాతలు : వి.వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, సంగీతం: రధన్, గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: నీరవ్ షా, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు)

చాలా కాలం తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. విడుదలకు ముందు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి ఓ యంగ్ హీరోతో కలిసి నటిస్తుండడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య నేడు (7, సెప్టెంబర్ 2023) ఈ సినిమా థియేటర్ల లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం…

కథ: లండన్‌కు చెందిన మాస్టర్ చెఫ్ అన్విత రవళి శెట్టి (అనుష్క శెట్టి). ఆమె పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలనుకుంటుంది. గర్భం కోసం తన భాగస్వామిగా స్టాండ్ అప్ కమెడియన్ అయిన సిద్ధు పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి)ని ఎంచుకుంటుంది. సిద్ధూ ఆమె ఉద్దేశాలేమీ పట్టించుకోకుండా, ఆమె ప్రేమలో పడతాడు. ఆమె అసలు ఉద్దేశ్యం తెలిసినప్పుడు మాత్రమే అతడు ఆశ్చర్యపోతాడు. అయితే తల్లి కావాలనుకునే అనుష్క కలను సాకారం చేయడంలో అతను ఆమెకు సహాయం చేస్తాడా? ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది.. అలాంటి నిర్ణయం తీసుకునేలా అన్వితను ప్రేరేపించినది ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ఆద్యంతం సినిమా ఎమోషనల్ గా సాగుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సూటిగా, ఛాలెంజ్ గా ఉండే కాన్సెప్ట్‌ను దర్శకుడు మహేష్ బాబు ఎంతో చక్కగా తెరకెక్కించాడు. అనుష్క శెట్టి అన్విత రవళి శెట్టి పాత్రలో హుందాతనంగా అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఆమె స్క్రీన్‌పై అద్భుతంగా కనిపించడమే కాకుండా పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చి ప్రేక్షకులచేత వాహ్… అనిపించేలా చేసింది. ఇక నవీన్ పొలిశెట్టి తనకు తగిన పాత్రలో మరోసారి చక్కని పర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు. అతని కామెడీ ఆడియెన్స్ ను విశేషంగా ఎంటర్టైన్ చేస్తాయి. ఎమోషనల్ సీక్వెన్స్‌లను కూడా ఎంతో చక్కగా హ్యాండిల్ చేశాడు. మురళీ శర్మ పాత్ర ఆసక్తిగా సాగింది. ఉన్నంతలో మెచ్చుకోదగిన నటనను ప్రదర్శించాడు.

ఎలాంటి పాత్రలు అతడికి కొట్టినపిండే. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో బాగా నటించి అందరిచేత సెహబాష్ అనిపించుకున్నారు. ఇతర పాత్రల్లో నటించిన సహాయ నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు. కథ మామూలుగానే ఉన్నప్పటికీ, స్లోగా నడిచినప్పటికీ దర్శకుడు కథనాన్ని నడిపినతీరు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. అక్కడక్కడ అనవసరమైన సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా అనిపిస్తుంది. కథలో మరింత ఎమోషనల్ డెప్త్ ఇంజెక్ట్ చేయడం వల్ల పాత్రలతో ప్రేక్షకుల అనుబంధం మరింత బలపడి ఉండే అవకాశం ఉంది. మురళీ శర్మ, సోనియా దీప్తి, అభినవ్ గోమతం చేసిన పాత్రలకు మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే సినిమా మరింతగా అలరించి ఉందేది. సినిమాలో ఫస్ట్ హాఫ్ మరియు సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు స్లోగా సాగాయి. అయినప్పటికీ అవి ప్రేక్షకుల్ని పెద్దగా ఇబ్బంది పెట్టావు.

సాంకేతిక విభాగం: పెర్‌ఫార్మెన్స్‌తో పాటుగా, గోపీ సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి. రైటర్, దర్శకుడు మహేష్ బాబు తన వర్క్ తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో తన బెస్ట్ అవుట్‌పుట్‌ను అందించాడు. అయితే, స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ధ పెట్టి ఉండే బాగుండేది. రధన్ సౌండ్‌ట్రాక్‌లో మూడు పాటలు ఉన్నాయి. అవి ఆకట్టుకున్నాయి. . నీరవ్ షా సినిమాటోగ్రఫీ ఓకే. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సీనియమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. మొత్తం మీద, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. చిత్రంలో అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టిల పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. ఎమోషన్స్ సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.