“హుషారు” మూవీ రివ్యూ

టోటల్  “హుషారు”
రచన – ద‌ర్శ‌క‌త్వం: శ్రీహ‌ర్ష 
తారాగ‌ణం: తేజస్, తేజ్, అభినవ్, దినేష్ తేజ్, ప్రియా వడ్లమాని, దక్ష, హేమ త‌దిత‌రులు
సంగీతం: ర‌ధ‌న్, ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ తోట‌
బ్యాన‌ర్స్: ల‌క్కీ మీడియా, ఆసిన్ మూవీ క్రియేష‌న్స్‌, హెచ్‌.కె.ఫిలింస్‌
నిర్మాత‌లు: బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌
విడుదల : డిసెంబర్ 14, 2018
3/5

***
యూత్ సినిమాల పేరుతో వారంవారం కొత్తదర్శకులు కొత్త వాళ్ళతో తీస్తున్న రోమాంటిక్ కామెడీలు ఇలా వచ్చి ఆలా వెళ్ళిపోతున్నాయి. రోమాంటిక్ కామెడీలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇవి కాకుండా వేరే సినిమాలు తీయలేరా అనే ప్రశ్నఒకటి ఎప్పుడూ వస్తూనే వుంటుంది. దీనికి జవాబుగా కొన్నేళ్లుగా కనుమరుగైపోయిన బ్రొమాన్స్  జానర్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ని మళ్ళీ తెరమీదికి తెచ్చారు. యూత్ అప్పీల్ కోల్పోయిన పేలవమైన ప్రేమ సినిమాల నుంచి రిలీఫ్ గా ఫ్రెండ్ షిప్ మీద ‘హుషారు’ తీసి ఈ వారం విడుదల చేశారు. ఫ్రెండ్ షిప్ మీద గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అయితే గ్యాప్ చాలావుంది. ఈ గ్యాప్ ఎంతవరకూ ఈ ఫ్రెండ్ షిప్ మూవీకి ప్లస్ అయింది? ఈ గ్యాప్ ని సద్వినియోగం చేసుకుంటూ సక్సెస్ అయ్యే ప్రయత్నం  ఏమైనా చేశారా లేదా ఒకసారి చూద్దాం.

కథ 

ఆర్య, చై, బంటీ, ధృవ్ క్లోజ్ ఫ్రెండ్స్. చదువబ్బక, మందు ఫ్రెండ్స్ లా తిరుగుతూ వుంటారు. చై కో గర్ల్ ఫ్రెండ్ రియా (ప్రియా వడ్లమాని) వుంటుంది. అర్యకి కూడా గీత (దక్ష) అనే గర్ల్ ఫ్రెండ్ వుంటుంది. చై గర్ల్ ఫ్రెండ్ రియా  యూఎస్ కి వెళ్ళిపోదాం రమ్మని బలవంత పెడుతుంది. ఇక్కడ ఫ్రెండ్సే ప్రాణమైన చై  ఒప్పుకోడు. ఆమె బ్రేక‌ప్ చెప్పేస్తుంది. ఆ బాధతో వున్న చై యాక్సిడెంట్ కి గురవుతాడు. ట్రీట్ మెంట్ లో బ్రెయిన్ ట్యూమర్ వుందని బయటపడుతుంది. దీనికి 30 లక్షలు కావాలి. దీంతో ఫ్రెండ్స్ ముగ్గురూ సమస్యలో పడతారు. అంత డబ్బు సంపాదించి చైని బతికించుకోవడ మెలా? ఇందుకేమేం పనులకి పాల్పడ్డారు? చివరికేమైంది? ఇదీ కథ.

ఎలావుంది కథ 


 పూర్తి స్థాయి బ్రొమాన్స్ జానర్ కథ. టైటిల్ కి తగ్గట్టు సమస్యల్ని తేలికగా తీసుకుని సాగిపోయే హుషారైన కథ. బ్రొమాన్స్ లో నైనా, రోమాంటిక్ కామెడీ లోనైనా పెద్ద వయసు క్యారెక్టర్లు నీతులతో క్లాసులు పీకి యూత్ ని మార్చే చాదస్తాలు వుండవు. కానీ తెలుగులో ప్రతీ రోమాంటిక్ కామెడీ ఇలాగే వుంటూ భయపెడుతోంది. అలాటిది  ఇలాటి  చాదస్తం లేని కథగా ‘హుషారు’ అనే ఈ బ్రొమాన్స్ చాలా రిలీఫే. తల్లిదండ్రుల పాత్రలున్నా అవి కథని మేనేజ్ చేయకుండా సమస్యల్నీ వాటి పరిష్కారాలనీ పిల్లలకే వదిలేస్తాయి. యూత్ వాళ్ళ జీవితాలు వాళ్ళే జీవించడం నేర్చుకునే స్వావంబలనని ప్రదర్శించేవే నిజమైన బ్రొమాన్స్, రోమాంటిక్  కామెడీల ఉద్దేశం. ఇది ఈ కథ నేరవేరుస్తోంది. ఇవాళ్టి యూత్ సినిమాల మార్కెట్ యాస్పెక్ట్ రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్. చాలా కాలానికి ఈ కథ ఎకనమిక్స్ తో మార్కెట్ యాస్పెక్ట్ ని క్యాష్ చేసుకోగల్గింది. 

ఎవరెలా చేశారు


ఫ్రెండ్స్ గా నటించిన నటులు నల్గురూ కొత్త వాళ్ళే అయినా వెంటనే ఆడియెన్స్ కి కనెక్ట్ అయిపోతారు. పాత్ర చిత్రణలు అలా వున్నాయి. పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకున్న ఎక్కువ సమయం ఇందుకు తోడ్పడింది. చివరిదాకా నల్గురూ ప్రేక్షకుల హృదయాలకి దగ్గరగానే వుండిపోతారు. అన్యూహ్యమైన వాళ్ళ చర్యలు, చేష్టలు ఇవే ఎంటర్ తిన్ చేస్తూ పాత్రల్ని ఎలివేట్ చేస్తాయి. వెకిలి, అశ్లీల, అసభ్యతనాలకి పోకుండా హద్దుల్లో వుండడం చాలా ప్లస్ అయింది. లిప్ లాకులు సరే, ఇవి కామన్ అయిపోయాయి. వీటి ప్రభావం కూడా తగ్గుతోంది. 

ఇద్దరు హీరోయిన్లూ నీటైన పాత్రల్ని పోషించారు. ప్రియా వడ్లమాని ‘శుభలేఖ + లు’ లాగా కాకుండా, ప్రాక్టికల్ గోల్స్ వున్న ఈ కాలపు అమ్మాయిగా చక్కగా నటించింది. ఇక సెకండాఫ్ లో వచ్చి చివరిదాకా ఏలుకునే రాజ్ బుల్లం కామెడీ పాత్రలో రాహుల్ రామకృష్ణ పెద్ద ఎట్రాక్షనే అని చెప్పాలి. సెకండాఫ్ లో కూడా అవే పాత్రలతో అదే కథ తెలిపోయే ప్రమాదాన్ని వూహించి, వ్యూహాత్మకంగానే  కథలో కలిసిపోయే రాహుల్ రామకృష్ణ పాత్రని సృష్టించినట్టుంది. సెకండాఫ్ ని నిలబెట్టడానికి ఈ పాత్ర ఒక తురుపు ముక్కలా పనిచేసింది. అతడి శీఘ్రస్ఖలన సమస్యని ఫ్రెండ్స్ తీర్చే ప్రయత్నం చాలా కామెడీగా వుంది. 
 సాంకేతికంగా దీని బడ్జెట్  కి తగ్గట్టుగా వుంది. ముఖ్యంగా మ్యూజిక్ ఒక హైలైట్, ఇంకో హైలైట్ కెమెరా వర్క్. 

చివరికేమిటి 

కొత్త దర్శకుడి మొదటి సినిమాకి రైటింగ్ డిపార్ట్ మెంట్ ఈ మాత్రమైనా కష్ట పడిందంటే ఆశ్చర్యమే. ఐతే కథని డిటైల్డ్ గా చెప్పాలని, పాత్రల్ని డిటైల్డ్ గా చూపించాలనీ అవసరానికిమించి శ్రమపడ్డారు. దీంతో సాగి సాగి రెండున్నర గంటలు దాటింది. ఫ్రెండ్ ని బ్రెయిన్ ట్యూమర్  స్టేజికి తీసుకురావడానికి ఫస్టాఫ్ అంతా ఎంత కథ చేశారో, దానికి మించిన కథ సెకండాఫ్ లో ఆ క్యాన్సర్ చికిత్స కోసం ఫ్రెండ్స్ చేసే స్ట్రగుల్ కి చేశారు. ఐతే ఇదంతా ఫన్నీ గా ఎక్కడా కథ ఆగకుండా సాగడంతో టైము తెలీదు. పైన చెప్పుకున్నట్టు కథ పాతదే, కథనం హుషారైనది. అనేక సన్నివేశాలు బాగా నవ్వించేట్టున్నాయి. దేన్నీ సీరియస్ గా తీసుకోకుండా, ఎదురయ్యే కష్టాలని హుషారుగా ఎదురీదే పాత్రల స్వభావం బ్రెయిన్ ట్యూమర్  అనే సీరియస్ పరిస్థితిని తేలిక చేశాయి. దీంతో బ్రొమాన్స్ సినిమాలకి వచ్చిన గ్యాప్ ని సక్సెస్ ఫుల్ గా సొమ్ముచేసుకున్నట్టయింది. కాలం చెల్లిన రోమాంటిక్ కామెడీలనుంచి ఈ మాత్రం ప్రేక్షకుల్ని ఆకర్షించగలగడం గొప్పే.

―సికిందర్