Hi Nanna Movie Review – ‘హాయ్ నాన్న’ మూవీ రివ్యూ: ఎమోషనల్ డ్రామా!

(చిత్రం : హాయ్ నాన్న, విడుదల : 7 డిసెంబర్-2023, రేటింగ్ : 3.25/5, నటినటులు:నాని, మృణాల్‌ ఠాకూర్‌, కియారా ఖన్నా, శృతి హాసన్‌, జయరామ్‌, అంగద్‌ బేడీ, ప్రియదర్శి తదితరులు. దర్శకత్వం:శౌర్యవ్‌, నిర్మాత:వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సంగీతం:హేషమ్‌ అబ్దుల్‌ వాహద్‌, సినిమాటోగ్రఫీ:షను వర్గీస్‌)

న్యాచురల్‌ స్టార్‌ అన్న పేరుకు తగ్గట్టే నాని నటన చాలా సహజంగా ఉంటుంది. మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి పాత్రల్లో ఆయన ఇట్టే ఒదిగిపోతారు. రొమాంటిక్‌ సినిమాల్లో నటన తోటి యూత్‌లో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్నారు. అలాంటి ఆయన ‘దసరా’ సినిమాలో ఊర మాస్‌ లుక్‌లో కనిపించారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. నాని లుక్‌కు, నటనకు మంచి పేరొచ్చింది. నాని తాజాగా ‘‘హాయ్‌ నాన్న’’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వటంలో ముందుండే కథానాయకుడు నాని. మరోసారి ఈ సినిమాతో శౌర్యవ్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. శౌర్యవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని పాత లుక్‌లో కనిపించారు. మరి, కెరీర్‌లో ఎక్కువ విజయాలు తెచ్చిన పెట్టిన జోనర్‌లో నాని సక్సెస్‌ సాధించాడా? కొత్త దర్శకుడు శౌర్యవ్‌తో.. నాని ఫ్యామిలీ డ్రామా ఎంత వరకు వర్కవుట్‌ అయింది? మరి హాయ్‌ నాన్న ప్రేక్షకులను మెప్పించిందా..లేదా? తెలుసుకుందాం…

కథ: విరాజ్ (నాని) ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. అతడికి తన గారాలపట్టి అయినా కూతురు మహి (కియారా ఖన్నా) అంటే ప్రాణం. ఆ చిన్నారి ఓ వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఆలా మృత్యువుతో పోరాటం చేస్తున్న కూతురు కోసం ప్రాణాలను పణంగా పెడుతాడు విరాజ్. అయితే అప్పుడుడప్పుడు తన కూతురుకు కథలు చెబుతూ ఉంటాడు. ఈ క్రమంలో తాను చెప్పే కథల్లో అమ్మ లేదని, తనకు అమ్మ కథ చెప్పాలని పట్టుపట్టడమే కాకుండా అలుగుతుంది. దాంతో తన అమ్మ కథను చెప్పడానికి ఇష్టపడకపోవడంతో అలిగిన మహి రోడ్డుపై పరుగులు పెడుతుంటే.. యష్ణ (మృణాల్ థాకూర్) కాపాడుతుంది. నాని భార్య బిడ్డను వదిలేసి ఎక్కడికి వెళ్లింది? మహి ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నది? కొద్ది సంవత్సరాలే మహి బతుకుతుందని చెప్పిన సమయంలో జీవితంలో విరాజ్ ఎలాంటి చాలెంజ్‌ను స్వీకరించాడు? విరాజ్, మహి జీవితంలోకి వచ్చిన యష్ణ ఎవరు? వారం రోజుల్లో పెళ్లి కుదిరిన యష్ణ.. విరాజ్ ఫ్యామిలీకి ఎలా దగ్గరైంది. డాక్టర్ అరవింద్‌ (అంగద్ బేడీ)తో పెళ్లిని కాదనుకొని మహి కోసం యష్ణ ఎందుకు తాపత్రయ పడింది? అరుదైన వ్యాధిని మహి జయించిందా? మహికి తల్లి కావాలనుకొన్న యష్ణ కోరిక నెరవేరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ‘హాయ్ నాన్న’ చిత్రం కథ.

విశ్లేషణ : ఇండస్ట్రీలో కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చే హీరోల్లో నాని కూడా ఒకరు. కొత్త దర్శకులు తమ మొదటి సినిమా కోసం మనసు పెట్టి పని చేస్తారన్నది వాస్తవం. అందుకే కొత్త దర్శకుల నుంచి వచ్చిన నూటికి తొంభై శాతం సినిమాలు సక్సెస్‌ సాధిస్తుంటాయి. కారణం ఏదైనా కావచ్చు.. నాని కొత్త దర్శకులను ఎంపిక చేసుకుని మంచిపనే చేస్తున్నారు. శౌర్యవ్‌ ‘హాయ్‌ నాన్న’ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారని చెప్పొచ్చు. కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కథ కొత్తది కాకపోయినా.. కథను సినిమాగా తెరకెక్కించిన విధానం.. కథను ప్రేక్షకులకు చూపించిన విధానం మాత్రం కొత్తగా ఉంది. స్క్రీన్‌ ప్లే విషయంలో శౌర్యవ్‌ బాగా కష్టపడ్డారు. ప్రతీ షాట్‌, సీన్‌ను అద్భుతంగా తీర్చి దిద్దారు. అన్ని క్రాఫ్ట్‌లనుంచి మంచి అవుట్‌పుట్‌ను రాబట్టారు. ముఖ్యంగా నటీనటుల నుంచి యాక్టింగ్‌ను పిండేశారు. డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ట్రైలర్‌ విడుదలైన నాటినుంచే డైలాగులు జనం నోళ్లలో నానుతూ ఉన్నాయి. విరాజ్, మహి బాండింగ్‌ను, క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసే అంశం కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. హోమ్లీ, ఫన్ వాతావరణంతో ఎక్కువ కాలయాపన చేయకుండా దర్శకుడు శౌర్యువ్ నేరుగా కథలోకి తీసుకెళ్లడంతో ఫీల్ గుడ్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ కథలో వేగం లేకపోవడం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ ముందు నడిపించిన డ్రామా, ఎమోషన్స్ వర్కవుట్ కావడంతో ఫస్టాఫ్ కొత్త అనుభూతిని పంచడమే కాకుండా సెకండాఫ్‌పై అంచనాలు పెంచుతుంది. తండ్రి, కూతుళ్ల మధ్య కథ కావడం, స్టోరీలో వేరియెషన్స్, ట్విస్టుల కారణంగా దర్శకుడు ఎక్కువగా డిటైల్‌గా చెప్పడం వల్ల సాగదీసినట్టు అనిపిస్తుంది. ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్‌ కారణంగా ప్రతీ సీన్ ఉద్వేగానికి గురిచేసేలా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు గుండెను పిండేసే నాటకీయత భావోద్వేగానికి గురిచేస్తుంది. చివర్లలో జయరామ్ క్యారెక్టర్ ట్వీస్టు, అలాగే అంగద్ బేడీ ఎపిసోడ్ సినిమాను మరింత గంభీరంగా, ఎమోషనల్‌గా మారుస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించేలా ఉంటాయి. తండ్రి, కూతుళ్లు, భార్యాభర్త, తల్లి కూతుళ్ల మధ్య భావోద్వేగంతో సాగే చిత్రం హాయ్ నాన్న. తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమైన శౌర్యు రాసుకొన్న కథ, కథనాలు అద్బుతంగా తెరపైన పండాయి. ప్రతీ సన్నివేశంలో జొప్పించిన సెంటిమెంట్ ప్రేక్షకుడి హృదయాలను కుదిపేస్తాయి. ఇటీవల కాలంలో వచ్చిన ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా హాయ్ నాన్న చెప్పుకోవచ్చు. నాని, మృణాల్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే చిత్రంగా అనిపిస్తుంది. ఈ ప్రపంచం అంతా మనల్ని వెలేసినా.. అమ్మ మాత్రమే తన కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది అని అంతా నమ్ముతారు. ఇది సత్యం కూడా. కానీ.., “హయ్ నాన్న” మూవీ కథ దీనికి పూర్తి వ్యతిరేకమైన పాయింట్ దగ్గర మొదలవుతుంది. కథలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నా, ఎంత ఎమోషన్ ఉన్నా.. ఇలాంటి ఓ పాయింట్ తో ఏకంగా సినిమా చేయడం అంటే రిస్క్ తో కూడుకున్న పనే. కానీ.., దర్శకుడు దీన్ని సవాల్ గా తీసుకున్నాడు. ఇందుకోసం నాన్న సెంటిమెంట్ ని బలంగా వాడుకున్నాడు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో వచ్చే కొన్ని బలమైన సన్నివేశాలు ఈ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.

ఎవరెలా చేశారంటే… విరాజ్‌గా నాని మరోసారి అద్బుతమైన పాత్రలో ఒదిగిపోయాడు. తండ్రిగా, ప్రియుడిగా, భర్తగా, ఓ ప్రొఫెషనల్‌గా పలు రకాల వేరియేషన్స్‌ను పండించిన విధానం అదుర్స్ అనే చెప్పాలి. బరువైన, భావోద్వేగమైన సీన్లలో నాని పలికించిన హావభావాలు ఉద్వేగానికి గురిచేస్తాయి. ఇక టిపికల్ క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్ నటించిన తీరు ఫెంటాస్టింగ్‌గా ఉంటుంది. అందం, అభినయం, రొమాన్స్‌, సెంటిమెంట్ సీన్లలో ఇరగదీసే లెవెల్లో నరించి మెప్పించింది. సీతారామం తర్వాత మరోసారి ది బెస్ట్ పాత్రతో అభిమానులను ఆకట్టుకొన్నదనే చెప్పాలి. నాని కూతురుగా మహీ పాత్రలో నటించిన కియారా ఖన్నా నటన గురించి చెప్పడానికి మాటలు చాలవు. తెరపైన చూసి ఆ చిన్నారి నటనను ఆస్వాదించాల్సిందే. ఇక హాయ్ నాన్న చిత్రంలో మృణాల్ తల్లి పాత్ర, అలాగే కన్నడ నటుడు జయరాం, హిందీ నటుడు అంగద్ బేడీ తమ పాత్రలతో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. జయరాం క్యారెక్టర్‌కు సంబంధించిన ట్విస్టు సినిమాను మరో మెట్టు ఎక్కించింది. అంగద్ బేడీ క్యారెక్టర్ వ్యవహరించిన తీరు సినిమా ముగింపును ఫీల్‌గుడ్‌గా మార్చింది. ప్రియదర్శి, నాజర్ కథకు సపోర్టుగా మారే పాత్రకు న్యాయం చేశారు.

టెక్నీకల్ విషయాలకొస్తే.. ప్రధానంగా చెప్పుకోవలసింది సినిమాటోగ్రఫి గురించి. ఈ చిత్రానికి సాను వర్గీస్ అందించిన సినిమాటోగ్రఫి ఎంతో అందంగా ఉంది. ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా చూపించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ రొటీన్‌గా ఉంది. పాటలు ఆకట్టుకొనేలా లేకపోవడం కొంత మైనస్ గా చెప్పుకోవాలి. ప్రవీణ్ ఆంథోని ఎడిటింగ్ ఓకే. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌పై మోహన్ చేరుకూరి, విజేందర్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు సినిమాను క్లాస్‌గా మార్చింది. సినిమా మొదలైన నాటినుంచే ‘హాయ్‌ నాన్న’ టీం ప్రమోషన్లను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రమోషన్లలో భాగంగా విడుదలైన పాటలకు ఎంతటి రెస్సాన్స్‌ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో పాటలు ట్రెండింగ్‌లో నిలిచాయి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహద్‌ తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశారు. సినిమా స్టార్టింగ్‌ దగ్గరి నుంచి ఎండింగ్‌ వరకు ఎక్కడా మ్యూజిక్‌ ఫ్లో తగ్గదు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ మనసుకు హత్తుకు పోతుంది. సినిమాటోగ్రాఫర్‌ షను వర్గీస్‌ పని తనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన కెమెరాను ప్రేక్షకుల కళ్లనుంచి చూసి తీసినట్లు ఉన్నాడు. ప్రతీ ఫ్రేము, షాట్‌, ప్రతీ సీను ఐ ఫీస్టుగా ఉంటుంది. ఎడిటర్‌ ప్రవీణ్‌ ఆంథోనీ పూర్తి న్యాయం చేశారు. ఫన్, లవ్, ఎమోషన్స్ కలబోసిన ఈ సినిమాను మిస్ చేసుకోవద్దు.