Devil Movie Review : ‘డెవిల్’ మూవీ రివ్యూ : మాస్ ‘డెవిల్’

కళ్యాణ్ రామ్ గత ఏడాది బింబిసారతో హిట్టు కొట్టాడు. ఈ ఏడాది అమిగోస్ అంటూ ఓ ప్రయోగం చేశాడు. ఇక ఇప్పుడు డెవిల్ అంటూ నాటి కాలానికి తీసుకెళ్లేందుకు వచ్చాడు. డెవిల్ టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. అలాంటి సినిమా ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం…

కథలోకి వెళితే… డెవిల్ కథ 1945 ప్రాంతంలో జరుగుతుంది. అది కూడా మద్రాసు ప్రావీన్స్ చుట్టూ జరుగుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పట్టుకునేందుకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అలాంటి టైంలోనే బోస్ ఇండియాలోకి అడుగు పెడుతున్నాడంటూ బ్రిటీష్ ఏజెన్సీలకు లీక్స్ అందుతాయి. బోస్‌ను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటారు. అదే టైంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. కూతుర్ని హత్య చేశారన్న ఆరోపణల మీద జమీందారుని అరెస్ట్ చేస్తారు. ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) రంగంలోకి దిగుతాడు. ఈ కేసులో జమీందారు మేనకోడలు నైషధ (సంయుక్త మీనన్)ను డెవిల్ ఓ కంట కనిపెడుతుంటాడు. అసలు ఈ కేసుకు, బోస్‌‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి? ఈ కథలో సుభాష్ చంద్రబోస్‌కు రైట్ హ్యాండ్ అయిన త్రివర్ణ ఎవరు? మణిమేఖల (మాళవిక నాయర్) పాత్ర ఏంటి? సముద్ర (వశిష్ట), షఫీ (షఫీ), జబర్దస్త్ మహేష్ (శేఖర్) పాత్రలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

విశ్లేషణ: డెవిల్ కథ, కథనాలు, తీసుకున్న పాయింట్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. డెవిల్ పూర్తిగా ఆడియెన్స్‌ను నాటి కాలానికి తీసుకెళ్తుంది. ఆ సెటప్, ఆ ఆర్ట్ వర్క్, ఆ క్యాస్టూమ్స్ ఇలా ప్రతీ ఒక్కటి అద్భుతంగా ఉంటాయి. ఇధి సమష్టి కృషి అని డెవిల్‌ను చూస్తే అర్థం అవుతుంది. కథ, కథనాలు ఎంతో గ్రిప్పింగ్‌గా ఉంటాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే వేవ్‌లో వెళ్తుంది. సస్పెన్స్, థ్రిల్ల్ అన్నీ మెయింటైన్ చేసేలా అద్భుతంగా స్క్రిప్ట్‌ను రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా విజయ హత్య చుట్టూ జరుగుతుంది. ఆ కేసును చేధించేందుకు వచ్చే బ్రిటీష్ ఏజెంట్ స్పెషల్ అధికారిగా కళ్యాణ్ రామ్ ఎంట్రీ, ఆ తరువాత ఆ కేసుకు సంబంధించిన ఒక్కో విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగడం, ఇంటర్వెల్‌కు ఓ ట్విస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్ట్స్ ఏం జరుగుతుంది? అనే కుతుహలం పెంచేలా సెకండాఫ్‌ను మొదలు పెడతారు. ఈ కథ అంతా కూడా బోస్, త్రివర్ణల చుట్టూ తిరుగుతుంది. అసలు ఆ త్రివర్ణ ఎవరు? అని బ్రిటీష్ ఏజెన్సీలు తలపట్టుకుంటాయి. త్రివర్ణ చేసిన విధ్వంసం సెకండాఫ్‌కే హైలెట్‌గా నిలుస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కో ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. చివరి వరకు ట్విస్ట్‌లు పడుతూనే ఉంటాయి. ఇక క్లైమాక్స్‌లో కళ్యాణ్ రామ్ నట విశ్వరూపాన్ని చూడాల్సిందే. అసలైన ఊచకోత ఏంటో ఈ క్లైమాక్స్‌లో చూపించారు. అలా డెవిల్ సినిమా ఎక్కడా కూడా తగ్గకుండా పరుగులు పెడుతూనే ఉంటుంది. క్లైమాక్స్‌ యాక్షన్ సీన్స్ అలరిస్తాయి.

ఎవరెలా చేశారంటే… కళ్యాణ్ రామ్ ఏజెంట్ డెవిల్‌గా అదరగొట్టేశాడు. కళ్యాణ్ రామ్ రెండు షేడ్స్‌ను బాగా చూపించాడు. కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా ప్రతీ సన్నివేశంలో కళ్యాణ్ రామ్ తన మార్క్ చూపిస్తాడు. ఇక ఫైట్స్‌లో మాత్రం విశ్వరూపం చూపించేశాడు. మాళవిక నాయర్, సంయుక్త మీనన్‌లకు మంచి స్కోప్ ఉన్న పాత్రలు దక్కాయి. బ్రిటీష్ అధికారులు చక్కగా నటించారు. నితిన్ మెహతా, వశిష్టి, ఏస్తర్, షఫీ, మహేష్ ఆచంట, అభిరామి, అజయ్ ఇలా అందరూ తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా ఈ చిత్రం ఎంతో ఎత్తులో కనిపిస్తుంది. ప్రొడక్షన్ పరంగా బాగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. నాటి కాలానికి తీసుకెళ్లేందుకు సరిపడా క్యాస్టూమ్స్, సెట్స్, కెమెరా వర్క్ అన్నీ బాగా కలిసి వచ్చాయి. మరీ ముఖ్యంగా హర్ష వర్ణన్ పాటలు, ఆర్ఆర్ సినిమాను ముందుకు నడిపించాయి. మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకుతాయి. దేశభక్తిని చాటుతాయి. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

రేటింగ్: 3.25