‘దసరా’ మూవీ రివ్యూ & రేటింగ్…

హీరో నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘దసరా’. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ నానికి జోడీగా కీర్తి సురేష్ మరో ప్రధాన పాత్రలో దీక్షిత్ శెట్టి నటించారు. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నాని ఎప్పుడూ కనిపించనటువంటి ఒక విభిన్న రా మరియు రస్టిక్ పాత్రలో కనిపించారు. దీంతో సహజంగానే ఈ సినిమాపై అందరికీ ఆసక్తి కలిగింది. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోల్లో నాని విభిన్నంగా కనిపిస్తుండడంతో హీరోగా అతడి పెర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. వారి ఎదురు చూపులకు తెరపడుతూ ఈ సినిమా శ్రీరామనవమి సందర్బంగా ఈ గురువారం (మార్చి 30, 2023) రోజు థియేటర్లలోకి అడుగుపెట్టింది. భారీ స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకొచ్చిందని చెప్పొచ్చు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలైన ఈ ‘దసరా’ సినిమా ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించింది? నాని అభిమానులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? సినిమా విడుదలకు ముందే ఏర్పడిన అంచనాలను ఎంతవరకు అందుకుందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే..!

కథేంటో చూద్దాం… తెలంగాణ ప్రాంతానికి చెందిన గోదావరిఖని సమీపంలోని వీర్లపల్లి అనే పల్లెలో ఈ కథ ప్రారంభమైంది. ఈ గ్రామానికి చెందిన ధరణి (నాని), సూర్యం (దీక్షిత్ శెట్టి) చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు. ఒకరికొకరు తోడుగా స్నేహానికి ప్రాణంగా మెలుగుతుంటారు. ధరణి వెన్నెల ( కీర్తి సురేష్)ను ప్రాణంగా ప్రేమిస్తాడు. అలా ప్రేమిస్తున్న అతడికి మరోవైపు తన ప్రాణ స్నేహితుడు సూర్యం కూడా వెన్నెలను ప్రేమిస్తున్నాడని తెలుస్తుంది. అప్పడు ధరణి తన ప్రేమను మనసులోనే చంపుకుని వారిద్దర్నీ ఒకటి చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. మరోవైపు వీర్లపల్లి లోని జనాల జీవితం సిల్క్ బార్ మరియు బొగ్గు మైనింగ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే సమయంలో లోకల్ రాజకీయాల వల్ల ధరణి జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ జరుగుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? దానివల్ల ధరణి జీవితం ఎలా మారింది? ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ?, సూర్యం ఎలా చనిపోతాడు?, తన స్నేహితుడిని చంపిన వారిపై ధరణి ఎలా పగ తీర్చుకున్నాడు?, చివరకు ధరణి–వెన్నెల ఒక్కటి అయ్యారా? లేదా? ఈ మధ్యలో ధరణి అనుభవించిన మానసిక వేదన ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ : యాక్షన్ డ్రామాతో ఆద్యంతం సినిమా ఆసక్తికరంగా సాగింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకులు మెచ్చుకునేలా తీర్చిదిద్దాడు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఇందులో కనిపించింది. ధరణి పాత్ర, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బేషుగ్గా ఉంది. అయితే.. కథలో అక్కడక్కడ ఆసక్తికరమైన కొన్ని ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. మలుపులు లేని కథనం కూడా కొన్ని చోట్ల నీరసంగా సాగినప్పటికీ ప్రేక్షకులు బోర్ ఫీలవ్వరు. కథలోని మెయిన్ ఎమోషన్స్ ను, నాని పాత్రలోని షేడ్స్ ను, కీర్తి సురేష్ తో సాగే లవ్ ట్రాక్ ను, అలాగే గోదావరిఖని తాలూకు వీర్లపల్లి నేపథ్యాన్ని.. ఆ నేపథ్యంలోని యాక్షన్ సీక్వెన్సెస్ ను.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతి పాత్రను ఎంతో చాకచక్యంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా నాని పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు ప్రతీఒక్కర్నీ విశేషంగా అలరిస్తాయి. సినిమాలో ద్వితీయార్ధం స్లోగా ఉంది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా… చాలా సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి. సినిమాలో హీరో ఎదుర్కొనే అవరోధాలు, అటాక్ లు పూర్తి సినిమాటిక్ గానే సాగాయి.

ఎవరెలా చేశారంటే… నాని ఈ సినిమాకి వెన్నెముకగా చెప్పుకోవచ్చు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో వచ్చిన ఈ చిత్రంలో నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. మొదటినుంచి చివరివరకు తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించాడు. తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. కామెడీ, యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో అతడి నటన నెక్స్ట్ లెవెల్ లోకి వెళుతుంది. ధరణి పాత్రకు ప్రాణం పోశాడు. మునుపెన్నడూ చూడని విధంగా రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో జీవించేశాడు. నిజంగానే పిరికివాడిలా, పచ్చి తాగుబోతులా ఎంతో సహజంగా కనిపించాడు. నాని – కీర్తి సురేష్ ల ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఫ్రెష్ గా అనిపించింది. డీ గ్లామర్ లుక్ లో వెన్నెలగా కీర్తి సురేష్ చాలా అందంగా , విభిన్నంగా కనిపించింది. డీ గ్లామర్ లుక్ లో కనిపించినప్పటికీ నటన పరంగానూ కీర్తి సురేష్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కింది. నానికి స్నేహితుడి పాత్రలో దీక్షిత్ శెట్టి బాగా అలరించి, తన నటనతో ఆకట్టుకున్నాడు. మలయాళం నటుడు షైన్ టామ్ చాకో కు మంచి స్కోప్ ఉన్న పాత్ర లభించింది. కీలక పాత్రలో నటించిన అతడి పెర్ఫార్మెన్స్ సెటిల్డ్‌ గా చాలా బాగుంది. సముద్రఖని ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. ఆయన కెరీర్ లో నిలిచిపోయే గెటప్ ఇది. నటనపరంగా బాగానే నటించినప్పటికీ సినిమాలో ఆయన పాత్ర కనిపించింది తక్కువ అని చెప్పుకోవాలి. సాయికుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఏమీలేదు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టినపిండే! ఝాన్సీ నటన కూడా ఒకే అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించి ప్రేక్షకులను మెప్పించారు.

సాంకేతిక విభాగం : దర్శకుడుశ్రీకాంత్ ఓదెలకి ఇది తొలిచిత్రం అయినప్పటికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకుడిలా తన పనితనాన్ని తెరపై చూపించారు. సుకుమార్ శిష్యుడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన శ్రీకాంత్ మొదటి సినిమాకే ఇలాంటి రస్టిక్ కథను ఎంచుకుని అందర్నీ ఆకట్టుకున్నారు. కథ నెరేషన్ కొంచెం స్లో గా అనిపించినప్పటికీ శ్రీకాంత్ ప్రేక్షకులను కథ తో బాగానే కట్టిపడేసారు. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం కూడా సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ ఏంతో బాగుంది. ఎంతో రియలిస్టిక్ గా, గ్రాండ్ విజువల్స్ తో ప్రతి సీన్ ను కూడా చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సినిమాలో విజువల్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎడిటర్ నవీన్ నూలి మరిన్ని సన్నివేశాలకు కత్తిరించి ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా … ‘దసరా’ సినిమా కథ మొత్తం ధరణి, వెన్నెల మరియు సూరి పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వారి స్నేహంతో మొదలైన కథ లోకి ప్రేమ, రాజకీయాలు ఎంటర్ అవుతాయి. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా ప్రేక్షకులకు బోరు కొట్టించకుండా ప్రతి సన్నివేశం చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. పొలిటికల్ డ్రామా ని కూడా చాలా బాగా చూపించారు. ఇంటర్వెల్ లో వచ్చే పెద్ద ట్విస్ట్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ సైతం అంతే ఆసక్తిగా సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా వచ్చే కొన్ని స్లో సన్నివేశాలు ప్రేక్షకులకు బోరు కొట్టించొచ్చు. కానీ నాని తన నటన తో అవేమీ కనిపించకుండా నడిపించారు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మరింత ఆసక్తిగా మారుతుంది. క్లైమాక్స్ ని కూడా చాలా థ్రిల్లింగ్ గా డిజైన్ చేశారు. ఓవరాల్ గా ఈ సినిమా నాని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా ఓ చక్కటి అనుభూతిని ఇస్తుంది. -ఎం.డి. అబ్దుల్

(చిత్రం : దసరా, దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల, విడుదల తేదీ : మార్చి 30, 2023, రేటింగ్ : 3/5, నటీనటులు: నాని, కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, ఝాన్సి, పూర్ణ, జరీనా వాహాబ్ తదితరులు. సంగీతం : సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాణం : శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినీమాస్ , నిర్మాత సుధాకర్ చెరుకూరి)