Anni Manchi Sakunamule Movie Review in Telugu : ‘అన్నీ మంచి శకునములే’ మూవీ ఎలా ఉందంటే…?

యువ కథానాయకుడు సంతోష్ శోభన్ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు అయితే చేసుకుంటూ వెళుతున్నారు కానీ.. విజయాలు మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో అతడు నటించిన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతా రామం చిత్రాల తర్వాత స్వప్న సినిమా సంస్థ నిర్మించిన ఈ సినిమా ఇది. ప్రియాంకా దత్ నిర్మాత. సంతోష్ శోభన్ కు జోడీగా మాళవికా నాయర్ నటించిన ఈ ‘అన్నీ మంచి శకునములే’ సినిమా మే 18, 2023న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విడుదలకు ముందు ప్రచార చిత్రాలు సినిమాపై పాజిటివ్ వైబ్ కలిగించాయి. మరి ఈ చిత్రం యువ కథానాయకుడు సంతోష్ శోభన్ కు విజయాన్ని ఇచ్చిందా? ప్రేక్షకుల్ని ఈ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…

కథ : ఓ కాఫీ ఎస్టేట్ గురించి రెండు కుటుంబాల మధ్య కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. ఆ రెండు కుటుంబాల్లోని ఓ కుటుంబ వారసుడు ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్), రెండో కుటుంబానికి చెందిన వారసులు దివాకర్ (రావు రమేశ్), సుధాకర్ (సీనియర్ నరేష్). ఇందులో రిషి (సంతోష్ శోభన్) సుధాకర్ కొడుకు, ఆర్య (మాళవికా నాయర్) ప్రసాద్ కుమార్తె. ఇద్దరూ ఒకే రోజు జన్మిస్తారు. అయితే..ఆస్పత్రిలో నర్సుల మధ్య జరిగిన మిస్ అండర్ స్టాండింగ్ వల్ల ఇద్దరు పిల్లలు మారిపోతారు. ప్రసాద్ ఇంట్లో.. ఆయన కొడుకుగా రిషి, సుధాకర్ ఇంట్లో..ఆయన కుమార్తెగా ఆర్య పెరుగుతారు. చిన్నతనం నుంచే వీరు మంచి స్నేహితులు. రిషి, ఆర్యని బాగా ఇష్ట పడతాడు. అయితే, ఆర్య కమర్షియల్ మైండ్ సెట్ లో ఉంటుంది. మరి చివరకు వీరిద్దరూ ఎలా కలిశారు?, తల్లిదండ్రులకు పిల్లలు మారిన విషయం తెలిసిందా? లేదా? కోర్టు కేసులు ఏమయ్యాయి? రిషి, ఆర్య మధ్య పరిచయం ప్రేమగా మారిందా? లేదా? చివరకి ఏమైంది? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ: కాలాలు మారినా, యుగాలు మారినా… తల్లిదండ్రులు, బిడ్డల మధ్య అనుబంధం, ప్రేమ చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. పేరెంట్స్ & చిల్డ్రన్ బంధానికి ఎప్పుడూ ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. ఆ కారణం వల్లే…ఈ నేపథ్యంలో ఎక్కువ సినిమాలు వస్తుంటాయి. అయితే… ఆ ప్రేమను, భావోద్వేగాలను ప్రేక్షకుల హృదయాలను తాకేలా బలంగా, కొత్తగా చెప్పినప్పుడు మాత్రమే విజయాలు వరిస్తాయి. దర్శకురాలు బీవీ నందినీ రెడ్డి ‘అన్నీ మంచి శకునములే’ చిత్రాన్ని ఫీల్ గుడ్ ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీతో ఆద్యంతం కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే.. రెండు కుటుంబాలకి సంబంధించి మంచి కథను ఎంచుకున్నారు కానీ.. ఆ కథకు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. పైగా సిల్లీ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో ఈ సినిమాని సాగదీశారు. హీరోహీరోయిన్ల మధ్య సాగే సీన్స్ కూడా బాగా స్లోగా సాగాయి. అలాగే వారి ప్రేమకు బలమైన సంఘర్షణ కూడా లేదు. దీనికి తోడు సెకండ్ హాఫ్ లో వీరి మధ్య అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. దీనికీ తోడు కొన్ని పాత చిత్రాల ప్రభావం కూడా ఈ చిత్రం పై ఎక్కువగా ఉంది. పైగా సినిమా ఈ స్లో నేరేషన్ తో పాటు ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకురాలు బాగానే ప్రయత్నం చేశారు కానీ, ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు. ఈ సినిమాలో కొన్ని కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ మాత్రం ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి. హీరోగా సంతోష్ శోభన్ రిషి పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే ‘సంతోష్ శోభన్, మాళవిక నాయర్’ ల రెండు కుటుంబాల మధ్య కోర్టు కేసు, ఆ కేసుతో ముడి పడిన మిగిలిన  పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. బాగానే కనెక్ట్ అవుతాయి. సినిమా మొదలైన కాసేపటికి ఇదివరకే చూసిన కథ తెరపైకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే…ప్రారంభ సన్నివేశం ఆస్పత్రిలో పిల్లలు మారడం ‘అల వైకుంఠపురములో’ను గుర్తుకు తెస్తుంది. అక్కడ ఇద్దరు అబ్బాయిలు అయితే… ఇక్కడ అమ్మాయి, అబ్బాయి! ఆ తర్వాత సినిమా కూడా కొత్తగా ఏమీ ఉండదు. గతంలో మనం చాలా సినిమాల్లో చూసిన సీన్లు తెరపైకి వస్తాయి. అయితే… కామెడీ కోటింగ్ సరిగా కుదరడంతో ఫస్టాఫ్ ఓకే అనిపిస్తుంది. సెకండాఫ్ ప్రారంభమయ్యాక క్లైమాక్స్ దగ్గరకు వచ్చే వరకు ఆ రొటీన్ సీన్స్ మన సహనాన్ని పరీక్షిస్తాయి. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలను కొంచెం బలంగా తెరకెక్కించారు. అవి హృదయాలకు హత్తుకునేలా ఉన్నాయి.

ఎవరెలా చేశారంటే… సంతోష్ శోభన్ రిషి పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. తన ఈజ్ యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సరైన సీన్ పడితే సంతోష్ శోభన్ ఎంత బాగా చేస్తాడు? అనేదానికి పతాక సన్నివేశాలు ఓ ఉదాహరణ. ఒకట్రెండు అయినా… ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేశారు. తండ్రి చేతిలో తిట్లు తింటూ, ఎప్పుడూ సంతోషంగా ఉండే కుర్రాడిగా మరోసారి మెప్పించారు. హీరోయిన్ గా నటించిన మాళవిక నాయర్ తన లుక్స్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. గత సినిమాలతో పోలిస్తే… లుక్స్ పరంగా మాళవికా నాయర్ కొత్తగా కనిపించారు. మరో కీలక పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ నటన బేషుగ్గా ఉంది. ఇతర పాత్రల్లో నటించిన సీనియర్ నరేష్, రావు రమేష్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి అద్భుతంగా నటించారు. తల్లి పాత్రలో గౌతమిని చూడటం కొంచెం రెఫ్రెషింగ్ గా ఉంది. అలాగే, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్ కూడా చాలా బాగా నటించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు. హీరో సిస్టర్ పాత్రలో ‘తొలిప్రేమ’ ఫేమ్ వాసుకి బావున్నారు. వాసుకి భర్తగా ‘వెన్నెల’ కిశోర్ కొన్ని సీన్లలో కనిపించారు. ఉర్వశి, ‘రంగస్థలం’ మహేష్ పాత్రల పరిధి కూడా కథలో తక్కువే. కేవలం ట్విస్ట్ కోసం వాడుకున్నారు.

టెక్నీకల్ విషయాలకొస్తే…మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయింది. అతడు అందించిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది.దృశ్యాలన్నీ చాలా అందంగా తన కెమెరాలో బంధించారు. ప్రియాంకా దత్ నిర్మాణ విలువలు చిత్ర స్థాయికి తగ్గట్టుగానే బాగున్నాయి. మొత్తంగా చూస్తే..ఇంటర్వెల్ ముందు కాస్త కామెడీ, తర్వాత మళ్ళీ చివర్లో ఎమోషనల్ క్లైమాక్స్ బావున్నాయి. కానీ, కథగా చూస్తే కనెక్ట్ కావడం కష్టం. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన ఈ ‘అన్నీ మంచి శకునములే’లో కొన్ని కామెడీ సీన్స్, ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ సీన్స్ తో పాటు, నటీనటుల నటన బాగున్నాయి. ఐతే, స్లో నేరేషన్, రెగ్యులర్ లవ్ డ్రామా వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమాలోని కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి అంతే!

(చిత్రం : అన్నీ మంచి శకునములే, విడుదల : మే 18, 2023, రేటింగ్ : 2.75/5, నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సావుకార్ జానకి, వాసుకి, ‘వెన్నెల’ కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, అశ్విన్ కుమార్ తదితరులు. నిర్మాణం : స్వప్న సినిమా-మిత్ర విందా మూవీస్, దర్శకత్వం: బీవీ నందినీ రెడ్డి, నిర్మాత: ప్రియాంకా దత్, సంగీతం: మిక్కీ జె మేయర్, సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్, మాటలు : లక్ష్మీ భూపాల, ఎడిటర్: జునైద్)